జీవితం
ఏదో ఒకటి తెలుస్తూనే ఉంటుంది, కొత్తగా ఏదో నేర్చుకున్నట్టుగానే ఉంటుంది, ఒకరిద్దరైనా కలుస్తారు. వాళ్ళు నాలోకి, నేను వాళ్ళలోకి పయనించాక ఎవరమూ ఒక్కరిగా మిగలం. కన్నీళ్లుగానో, బిగ్గర నవ్వులుగానో, లోపలికి ముడుచుకున్న మనుషులుగానో మారి, ఆ కలయికల పిదప విడివడి వచ్చిపోయే కరెంటుకు వెలిగి ఆరిపోయే బల్బుల్లా మిగిలిఉంటాం. నువ్వెవరికోసం వెతుకుతుంటావో, నిజానికి వాళ్ళు నీ ఎదుటే వుంటారు, ఎలాగైతే నిన్ను నీవు గుర్తుపట్టనట్టు వాళ్లనూ గుర్తుపట్టవు. మేల్కొని ఉన్న రాత్రుల్లో జీవితం నీ సమక్షంలో తచ్చాడినట్లు ఆ క్షణాల్లో మాత్రం బతికుంటావు. ఆ బతికిన ఘడియల గడియ తీయడం, మూయడం మాత్రమే జీవితం.