పోస్ట్‌లు

అంతర్యామి

 పశ్చిమం తనను కబళిస్తుందని తెలిసినా వడివడిగా సూర్యుడటే సాగుతున్నాడు. భద్రంగా దాచుకున్నదంతా దోస్తుందని  తెలిసినా పువ్వు భ్రమరాన్ని స్వాగతిస్తోంది. మనసులో ఒంటరితనాన్ని ఎవరితో పంచుకోవాలో తెలియక  అందరినీ తాకి చూస్తోంది గాలి. పైనింకా ఏదో ఉందని అందుకోవాలని చేతులు జాచి ఎగిరి పడుతోంది దీపశిఖ. యుగాలుగా పొందాల్సిందేదో పొందలేదని మనసు కరిగివారుతోంది ఆకసానికి. నువ్వంటే ఏమిటో అగుపడనీక  అంతటా నీవై నిండిన అంతర్యామి.... ఎప్పటికీ కనిపించకు గుప్పిట వీడితే....  అదే అంతం కాదు కదా?

నువ్వే బెటర్ బాసూ

తప్పులు జరుగుతున్నా పర్లేదు, నిదానంగా ఉన్నా కంగారు లేదు,  వెనుబడి పోయినా బాధ లేదు, అసలు గెలవక పోయినా ఇబ్బందిలేదు  ఇప్పుడు, ఇక్కడ చాలా మంది కన్నా నువ్వు మెరుగే… ఈ మందిలో ఉన్నవాళ్లు అసలు ప్రయత్నమే చేయడం లేదు.

నువ్వే తేల్చుకో

"నిజం" సర్జరీ లాంటిది, అప్పటికి భాధపెట్టినా కొన్నాళ్ళకు పూర్తిగా నయం చేస్తుంది.  "అబద్ధం " పెయిన్ కిల్లర్ లాంటిది, అప్పటికి హయిగా ఉన్నా తరవాత చాలా సైడ్ ఎఫెక్ట్ చూపిస్తుంది  ఇక్కడ ఎంచుకోవాల్సింది మనమే!

నాతో నేనే

చిత్రం
  నేను ఓడితే ఓదార్పు నేనే  నేను గెలిస్తే సంబరం నాతోనే  బాధలో సంభాషణ నాలోనే  నాసందేహంలో సమాధానం నేనే  నేను ఒంటరి అయితే  తోడుగా  ఉండేది నేనే  నేను అల్లరి అయితే  నన్ను అదుపు చేసేది నేనే  అన్ని నేనే అన్నింట్లో నేనే  అన్నిసార్లు అందరు రారుగా

పాములు

చిత్రం
  తస్మాత్ జాగ్రత్త! పలికే పాములు ఇవి... నరంలేని ఈ నాగుపాములు కనిపించని మనసునే కాటేయగలవు లాలాజలాన్ని స్రవించే ఈ రక్తపింజరలు ఎదుటి మనిషి సృజనను చంపేయగల విషాన్ని చిమ్మగలవు గుండె ధైర్యాన్ని చిదిమేసే ఈ కొండచిలువలు కదిలే కొండలైన దవడ గుహల్లో పొంచి ఉండి ఎదుటివారి హృదయాలను చుట్టి పడేస్తాయి... అయితే నరుడి నోట్లో నాట్యమాడే పాములన్నీ చెడ్డవే కాదు, ఇందులోనే ఆదిశేషులు, వాసుకిలు కూడా ఉన్నాయి!

రేయ్.....నిన్నే

  రేయ్....నువ్వొక చెత్త మనిషివిరా..! నా జీవితంలో ఎక్కడా నీ అంత వరెస్ట్ వాడిని చూడలేదు. ఈ రోజుకి కష్టమంటే ఏంటో తెలియదు ఆకలికి తినడం, పోతులా తిరగడం, స్వార్థంగా బతకడం ఇదే కదరా నీ దిన చర్య? నాకో డౌటూ..! నీ ఉద్దేశంలో జీవితం అంటే ఏమనుకున్నావ్..? నువ్వు కష్టం విలువను గుర్తించాలి లేదా అవతలి వారి బ్రతుకు అయినా నీకు తెలిసుండాలి. ఇవి రెండు కానప్పుడు మీ తాతల తండ్రుల తరాల ఆస్తులైనా నువ్వు అనుభవిస్తూ ఉండాలి అంతే...! ఇంకెప్పుడురా నిన్ను నువ్వు అర్థం చేసుకునేది. విను బ్రో, నీతోనే నే మాట్లాడుతున్నది... నువ్వు నీ సొంత కాళ్ల మీద నిలబడే ప్రయత్నం ఎప్పుడైనా చేశావా? చుట్టూ ఉన్న వాళ్లను చూసి, వారి కష్టాలను గుర్తించడానికి ఓపిక తీసుకున్నావా? మీ తల్లిదండ్రుల కష్టం మీద ఆధారపడడం కాదు బ్రో, నీ జీవితంలో ఏదో ఒక రోజు నువ్వు కూడా నీ దారిని సృష్టించుకోవాలి. ఒకవేళ నీకు ఆస్తులు లేవనుకో, అప్పుడు నీ బాధ్యత ఇంకా ఎక్కువ. ఆస్తులను సృష్టించే మార్గాలని నువ్వు వేయాలి. నువ్వు ఇప్పుడు చేసే ప్రతి పని నీ భవిష్యత్తుకు పునాది. నువ్వు ఇప్పుడు చెడుగా ప్రవర్తిస్తే, అది రేపు నీకు నిద్ర లేకుండా చేస్తుంది. నీ దగ్గర సొంత స్వార్థం తప్ప మరే...

దారులు

చిత్రం
నీ గమ్యం చేరడానికి దారులెన్నో.... అన్ని దారులు ఒక్కటి కాదు కొన్ని దారులు వేరు మురికి దారుల్ని మూసివేయక తప్పదు లేదంటే కంపు భరిస్తూ ప్రయాణించాల్సి వస్తుంది. నిజానికి సంకెళ్లు పడినప్పుడు  గొంతెత్తి ప్రశ్నించే దారిలో పో పిడికిలెత్తి పోరాడే దారిని వెయ్ నీ గమ్యం అగమ్యం కాకుండా చూసుకో!  ~ అ.ర.కు

మోసం చేయకు రోయ్

చిత్రం
నీ జీవిత పయనం లో ఎంతమందిని చూసావో...ఎంతమందితో మాట్లాడావో....ఎన్నో వేల  కోట్ల కిలోమీటర్లు  దాటుకుంటూ ప్రయాణం చేసావో..... ఒక్కసారైనా, ఒక్కరైనా నీ కారణంగా స్వాంతన పొందారా లేదా అని ఆలోచించు. మనిషి జీవితంలో కొన్ని ఇవ్వాలి, మరికొన్ని తీసుకోవాలి. స్వార్థం ఉండొచ్చు, కోరికలు ఉండొచ్చు, కానీ మోసంతో కూడిన ప్రవర్తన మాత్రం ఉండకూడదు. శుభరాత్రి

మగాడంటే

మగాడంటే వెలుగుకి కొవ్వొత్తై కరిగిన నాన్న మగాడంటే భుజంపై ధైర్యమిచ్చిన అన్నయ్య మగాడంటే తుంచి ఇచ్చిన హృదయానికి కడదాక ఊపిరిచ్చిన ప్రియుడూ/భర్త మగాడంటే అవసరానికి తొలి పలకరింపుగా  నిలబడే మిత్రుడు మగాడంటే మనిషితనపు పూర్ణత్వానికి స్త్రీతో కలిసి చెరిసగం!

మానవత్వాన్ని అడుగంటనీయకు

చిత్రం
  మానవత్వాన్ని అడుగంటనీయకు రాయిని గుండె చోటులో నిలిపి, కాలాన్ని కేవలం ప్రయోజనం తో కొలవకు స్పందించే గుణాన్ని మెరుగుపెట్టు కరుణనూ, సౌభ్రాతృత్వాన్ని తట్టిలేపు ప్రేమే అంతటా, అన్నిటా నిండి ఉందని నిరూపించేయ్ అసాధ్యాలూ సుసాధ్యాలూ మనకే చెల్లునోయ్. ~ అడుసుమల్లి రవి కుమార్

ఓయ్ అది చెప్పు ముందు

చిత్రం
  పుడుతూ తల్లికి, పోతూ నలుగురికి శ్రమ ఎలాగూ ఇస్తావు , బ్రతికినంత సేపైనా చుట్టూ నా అనుకునే వాళ్ళు చెప్తున్న బాధా - చెప్పుకోలేని వ్యధా , కాస్త పట్టించుకుంటే, పోయినపుడు చుట్టూ కూచునే మనుషులకి ఏడుపు నటించే శ్రమ తప్పిస్తావు . ఏం సాధించావో ? ఏం సంపాదించావో తరవాత ., ముందు నీ మొత్తం జీవితానికి ముగింపులో పక్కమనిషి కళ్ళలో రెండు చుక్కల కన్నీళ్ళని దాచిపెట్టావా ?

నాన్న నాన్న నాన్న నీ మనసు గొప్పది

చిత్రం
 మన కళ్ళల్లో  ఆనందాన్ని చూడాలని  తన కన్నీళ్లను దాచేస్తాడు నాన్న!  మన పెదవులపై  చిరునవ్వును చూడాలని తన కష్టాలను దాచేస్తాడు నాన్న! దుఃఖాన్ని  తాను అనుభవిస్తూ..సంతోషాన్ని  మాత్రమే మనకు ఇస్తాడు నాన్న! తన బిడ్డలు బాగుండాలని తపన పడుతూ..తపస్సు చేస్తాడు నాన్న! మనమెరిగిన తొలి నేస్తం నాన్న నడకలు నేర్పించిన తొలి భరోసా నాన్న మనకోసం మన లోకమైన మన తోడు నాన్నే మనతోనే ఉండి మనల్ని నడిపించేది నాన్నే మన ఆశలే తన ఆయువుగా మన గెలుపే తన లక్ష్యంగా.. మన జీవితాన్ని నిలబెట్టేందుకు నిత్యం శ్రమించే నిస్వార్థ శ్రామికుడు నాన్న! అందరూ నా వాళ్లే అనుకుంటూ జీవితాంతం ప్రేమాభిమానాలు పంచి నిస్వార్థంగా, కల్లా కపటాలు లేకుండా, తన కోసం తను ఎలా బ్రతకాలో కూడా తెలియకుండానే బ్రతికి వెళ్ళిపోయిన మా నాన్న రుణం ఎప్పటికీ తీర్చుకోలేను... ఇవాల్టికి ఇంకా మీ ఫోన్లో మీ నాన్న పేరుతో ఫోన్ రింగ్ అవుతుంది అంటే మీరంతా ఎంతో అదృష్టవంతులు అని అర్థం! ఏదో నీ నీడలో నా పని నేను చేసుకుంటూ బతికేవాడ్ని, నాకక్కర్లేని పెద్దరికాన్ని ఇచ్చి వెళ్లిపోయావు కదయ్యా😓 నీ జ్ఞాపకాల పదునుకి నా గుండె గాయం ఇంకా మానలేదయ్యా😭 ❤️నాన్న నువ్వే ...

నీవు శూన్యాన్ని జయించు

చిత్రం
శుభరాత్రి ఇప్పుడైతే నువ్వు శూన్యం కావచ్చు, అనంతం వైపు అడుగేయి. అనంతమంతా ఆక్రమించలేవేమో గాని శూన్యంగా మాత్రం మిగలవు. ఈ లోకంలో ప్రయత్నించి ఓడిపోయిన వాళ్ళ కంటే, ఓడిపోతానేమో అన్న  భయంతో అవకాశాలు కోల్పోయిన వాళ్ళే ఎక్కువ! ~ అ. ర. కు

నేను...నీ జీవితాన్ని

చిత్రం
  నేనూ.. నీ జీవితాన్ని.. నీలోని నీకు 'నిన్ను' చూపించే దర్పణాన్ని. క్షణానికోలా మాట్లాడ్డానికి నేను నీ మనసుని కాను.. నువ్వు పడినా, లేచినా.. ఆగక పరిగెట్టే కాలాన్ని కాను.. కాస్త ఓదార్పుకే ఆవిరైపోయి నిన్ను వెక్కిరించే కన్నీటినీ కాను.. రెప్ప పాటులో మాయమయ్యే నీ చిరునవ్వుని కాను. నేనూ.. నీ జీవితాన్ని.. నీలోని నీకు 'నిన్ను' చూపించే దర్పణాన్ని. చీకటిలో నిన్ను ఒదిలివెళ్ళిపోడానికి నేను నీ నీడను కాను.. కాస్త వెలుగుకే కరిగి చెదరిపోయే నీ కలనీ కాను.. అర్థం తెలియని గెలుపుని కాను.. పరీక్షించే ఓటమినీ కాను.. దూరాన మురిపించే గమ్యాన్ని కాను.. ముళ్ళతో బాధించే మార్గాన్ని కాను. నేనూ.. నీ జీవితాన్ని.. నీలోని నీకు 'నిన్ను' చూపించే దర్పణాన్ని. అనుక్షణం నీతోనే వుంటాను.. నీకు తోడుగా.. పడిపోతే పట్టుకుని లేపుతాను..ఓదారుస్తాను.. పరిగెడితే 'కాస్త జాగ్రత్త' నేర్పుతాను..ప్రేమగా.. నీ గమ్యమేమో గానీ.. దారిపొడవునా నా కాలిముద్రలే.. నేనుండగా నిన్ను ఒంటరిని కానివ్వను.. నేను లేని రోజుని నువ్వూ చూడవు.. నేను కఠినంగా వుంటే, కోప్పడు.. కానీ ద్వేషించకు.. నీ వెనుకే తిరుగుతున్నానని ఆట పట్టించు.. కానీ చులక...

నాన్న

చిత్రం
 మా నాన్నకి హృదయపూర్వక నివాళి, ఆయన లేనప్పుడు కూడా నా జీవితాన్ని రూపుదిద్దుతూ తన ఉనికిని నిరూపిస్తున్నారు.💙 ప్రియమైన నాన్న, నేను మీ జ్ఞాపకాలు నెమరు వేసుకుంటున్నప్పుడు, ఉద్వేగాలు తుఫానులా నాలో తిరుగుతున్నాయి.  మీరు నా హీరో నాన్న, నా బలం మరియు మార్గదర్శకత్వం. మా  పట్ల మీ ప్రేమకు హద్దులు లేవు; ఇప్పుడు కూడా, మీ అచంచలమైన ప్రేమ అందించిన వెచ్చదనం మరియు భద్రతను నేను ఇప్పటికీ అనుభవిస్తున్నాను. మీరు నాకు అంకితభావం మరియు పట్టుదల విలువను నేర్పించారు. నేను నన్ను నమ్మనప్పుడు కూడా మీరు నన్ను నమ్మారు. నా సామర్థ్యాల పై మీ విశ్వాసం నన్ను గొప్పతనం కోసం ప్రయత్నించేలా ప్రేరేపించింది. మీ అచంచలమైన మద్దతు, నాకు నా కలలను వెంబడించే ధైర్యాన్ని ఇచ్చింది. కానీ జీవితం, చాలా అన్యాయమైన ది మరియు కనికరం లేనిది. మీరు ఈ లోకాన్ని విడిచిపెట్టిన రోజు, నా హృదయం కోటి శకలాలు గా పగిలిపోయింది. ఆ తర్వాత వచ్చిన నిశ్శబ్దం నన్ను దుఃఖ సాగరంలో ముంచేసింది. నేను మీ బలమైన ఆలింగనం అనుభూతి చెంద లేను, లేదా మీ నవ్వు యొక్క ఓదార్పునిచ్చే ధ్వనిని మళ్లీ వినను. అకస్మాత్తుగా మోడు వారిన చెట్టు లాగా నేను మిగిలిపోయాను. భర్తీ చేయలేని శూన...

మా నాన్నే నాకు నారాయణుడు

చిత్రం
🄼🅈 🇩 🇦 🇩  🄸🅂 🄼🅈 🇭 🇪 🇷 🇴  ♥️ మా నాన్నే నాకు నారాయణుడు ♥️ జీవితమనే పంట భూమిలో, కష్టమనే హలాన్ని చేత బట్టి, సంసారమనే తడీ-పొడీ బీడు భూమిని సాగు చేసి, బాధ్యత, బరువు అనే చెమట ధారలతో కుటుంబ సేద్యాన్ని చేసి, తన ఆకలిదప్పులు లక్ష్య పెట్టక మా ఆకలి తీర్చిన నిస్వార్ధ నిత్య కర్షకుడు మా నాన్న! కొవ్వొత్తిలా కరిగినా, కష్టాలు చుట్టుముట్టినా, చిరునవ్వే ఆయుధంగా నా జీవిత ఆకాంక్షల మణిపూసలని ఒక్కొక్కటిగా కూర్చి, మాల లా అల్లి, నా మెడలో వేసిన సూత్రధారి మా నాన్న! "పదార్థంలో కాదు, యదార్థంలో జీవించండి" అని మాకు బోధ చేసిన మా నాన్నే, నాకు శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, దశావతారుడైన నారాయణుడు! ~ అడుసుమల్లి రవి కుమార్  

నీడ దుప్పటి

చిత్రం
ఇంత నీడ దుప్పటి, మీదేసి చెట్టు మౌనంగా కూర్చుంటుంది. చుట్టూ పరుచుకున్న నీడ మీద ఏడు రంగుల్ని కలగంటూ, ఆకుపచ్చదనంతో అబ్బుర పరుస్తుంది.  చెట్టు నీడన సేద దీరమంటూ ఏకాంతం కుక్క పిల్లై  వెంటపడుతుంది. అరుపుల్లేని ప్రేమలోకమొకటి పిట్టల గుంపై వచ్చి మీద వాలుతుంది. ఎండ నిట్టూర్పుల అలలు నీడ తీరంతో యుద్ధం చేస్తూ, చెట్టు మొదలుకు తలలు బాదుకుంటున్నాయి, హాయి లోకానికి స్వాగతం పలుకుతూ..! ~ అడుసుమల్లి రవి కుమార్ 

You are the winner

చిత్రం
  ఇప్పటికైతే వట్టి మట్టి ముద్దవి మాత్రమే. కాలం జరిగాక..తవ్వి చూస్తే శిలగా మిగులుతావో, శిల్పమై ఎదురొస్తావో,శిలాజంగా దొరుకుతావో?!  పంచభూతాత్మకమైన నీవు ఎప్పటికి విజేతవే, నీ ప్రయత్నం లో ఓడిపోనంత వరకు! ~ అ. ర. కు

సన్ ఆఫ్ సూర్య నారాయణ

నాన్నా... ⚜️కాస్తంత కష్టం ఎదురైన ప్రతిసారీ మీరు చూసిన ఎత్తుపల్లాలు గుర్తొస్తాయి. ⚜️మీ గుండె నిబ్బరం గుర్తొస్తుంది. కుటుంబమంటే మనమే కాదు, మన తోటి వాళ్ళు కూడా అనే మీ ఔదార్యం గుర్తొస్తుంది. ⚜️ఎవరెన్ని తప్పులు చేసినా, క్షమించిన మీ ప్రేమ గుర్తొస్తుంది.  ⚜️మీరు నేర్పిన జీవిత పాఠాలు గుర్తొస్తాయి. ⚜️కష్టాలెన్ని ఎదురైనా చలించని మీ ధీరత్వం గుర్తొస్తుంది.  ⚜️ఆస్తుల కన్నా చదువే గొప్పదన్న మీ మాటలు గుర్తొస్తాయి. ⚜️అసలేం లేకున్నా, బాధ పడని మీ ధైర్యం గుర్తొస్తుంది.  ⚜️అన్నిటికీ మించి మా స్వేచ్ఛను, మా ఆశల్ని సజీవంగా ఉంచిన మీ గొప్ప వ్యక్తిత్వం గుర్తొస్తుంది. ⚜️మీరు ఎప్పటికీ మా మార్గదర్శి..మా టార్చ్ బేరర్. అందుకే నేనంటాను ❤️మై డాడ్ ఈస్ మై హీరో❤️ ~ సన్ ఆఫ్ సూర్య నారాయణ

మోయకండి... వదిలించుకోండి

ఒక 100ml నీళ్ళ బాటిల్ పట్టుకొని నిలబడటం పెద్ద కష్టం కాదు. కానీ 10 నిమిషాలు పెట్టుకున్నాం పెద్దగా ఒత్తిడి ఏమి ఉండదు. గంట పెట్టుకున్నాం అది కూడ పెద్ద సమస్య కాదు, 3గంటలు పెట్టుకున్నాం ఒత్తిడి ప్రారంభం. 5గంటలు ఒత్తిడి పెరుగతోంది నిమిష నిమిషానికీ ఒత్తిడి పెరిగి బాటిల్ విసిరి కొడతాం.. అక్కడ దాని బరువు మారలేదు. ఫీలింగ్ మారిపోయింది. మనకి ఉన్న విషయాల్లో కూడా అనవసర విషయాలని పదేపదే గంటలు, రోజులు, నెలలు, సంవత్సరాల తరబడి మోస్తూ ఉంటే, చివరికి మానసిక ఒత్తిడి పెరిగి, నిర్ణయాలు వికటించి, పరిస్థితులని, మనస్సుని, శరీరాన్ని ప్రభావితం చేస్తాయి.  కనుక ఏ విషయాన్నైనా మోయకండి.. ఎక్కడిది అక్కడ వదిలేయండి. పట్టుకున్నంత మాత్రం చేత సరికాని విషయం సరవ్వదు. పట్టుకోపోయినంత మాత్రాన సరయ్యే విషయం సరికాకుండా పోదు..అనవసరమైన మానసిక ఒత్తిడికి గురికాకుండా ఉంటే ఆరోగ్యంగా ఉంటారు. శుభరాత్రి  ~ అ ర కు

పోరాడు...గెలిచేస్తావ్

చిత్రం
ఈ బరువు మోయలేవు! బిగ్గరగా అరవాలనుకుంటావు. నీలోంచి నీ చేయే నీ నోరు మూసేస్తుంది. కలల వంతెన మీద జారి పడుతున్నప్పుడల్లా, అగాధం కండ్ల ముందుకొచ్చి భయపెడుతుంది. పోరాడి పోరాడి ఓటమి ముందు కుప్పకూలిపోవటానికి నిన్ను నువ్వే అప్పగించుకునే పరిస్థితులు వస్తాయి. గతంలోకి తొంగి చూడకు. మానని గాయాలు చేతులకు తగులుతాయి. నడుస్తూ నడుస్తూ వెనుకకు తిరిగావా పాత స్మృతులేవో నిన్ను తగులబెట్టి చలి కాచుకుంటాయి. రాళ్ల దెబ్బల గుర్తులకు కాలమే మందు గాయాలు పాతవే, తెగింపే ఎప్పుడూ కొత్తగా వుండాలి. నీ ఆశయాలకి నువ్వే కదా "ది ప్రిన్స్"! ఉపాయం కనిపెట్టి, ఓర్పుగా, నేర్పుగా పోరాడు..గెలిచేస్తావ్! శుభోదయం ~ అ.ర.కు

శంకరా

తొలుగును పాపదోషములు తోయమునిచ్చిన నీకు శంకరా! వెలుగును కాంతి దీపములు, వేదన తీరును నిన్ను గాంచినన్, కలుగును సర్వ భాగ్యములు, కామన తీరగ నిన్నుగొల్చినన్! తలిచెద నీ నామమునే, తెలిసినది దేవర నీ మహిమెంత శిఖరమో! ఓం నమఃశివాయ

నీకంటే తోపెవ్వడు లేడిక్కడ

చిత్రం
మదిని మెలిపెడుతున్న మాటల ప్రవాహాలు, మతిని చెడగొడుతున్న జ్ఞాపకాల సమూహాలు, తనకు తానే లేని ఒంటరి పయనాలు, మనసే ప్రత్యర్ధైన కఠిన సమరాలు, ప్రయత్నమే లేక  ఓడిపోతూ, మళ్ళీ మళ్ళీ ఒంటరయ్యే సమయాన.. తను గీసిన పరిధిని దాటి విధి ఆడితే.. విధి ఆడిన వింత ఆటలో నువ్వు పావుగా మారితే.. మౌనముద్ర దాల్చిన బ్రహ్మను నిందించలేక, మూగబోయిన మహావిష్ణువుని మాటైనా అనలేక, కాంక్షించిన కోర్కెలు కనుమరుగవుతుంటే, ఊపిరిసలపని ఊసులు ఊగిసలాడుతుంటే, కనుల వాకిట బంగారు భవిత చితికిపోతుంటే చితికిన కోర్కెలనడుమ బతుకు ఏమవుతుందో?? అప్పుడే నీలోని శూన్యం లోకి ఒక్కసారి తొంగి చూడు.. దీర్ఘశ్వాస తీసుకో, మళ్లీ మొదలెట్టేయ్! నీకంటే తోపెవ్వడూ లేడిక్కడ!! ~ అ.ర.కు

మండు వేసవిలో కుండపోత వర్షం

చిత్రం
మండు వేసవిలో కుండపోత వర్షం.... 💦💦💦💦💦💦💦💦💦💦💦💦💦💦 పిలవని పేరంటానికి వచ్చిన అతిథి కాదు, జీవకోటి ఘోష విని, పలుకరించిన మురళి గానం. ఎండిపోయిన మాను, మోడు కు ప్రాణదీపం. మట్టి గంధపు పరిమళాల దివ్య వాహిని. ఎండ మంటకు కమిలిన గాయాలకు భిషక్కు. పశు, పక్షి గణాల దప్పిక తీర్చే చలివేంద్రం. మాసిన బతుకులు శుద్ధి చేసే పరిచారిక. భూగర్భంలో ఇంకిపోయే అమృతధార. ~ అడుసుమల్లి రవి కుమార్

పుస్తకం మన అస్తిత్వం

చిత్రం
పుస్తకం.... నా ఒంటరి నేస్తం! అజ్ఞానపు దారిలో వెలుగు దీపం! కాలక్షేపానికి మందు ఉత్సాహానికి ప్రేరణ నిరాశకు బద్ధ శత్రువు బద్ధకానికి బుద్ధి చెప్పే గురువు! ఒంటరితనంలో నీడలా వెంటుండే తోడు. మస్తకాలను పదునుపెట్టే సానరాయి! ఆలోచనల నిప్పురవ్వల్ని రాజేసే చెకుముకి రాయి! కొత్త లోకపు మెట్లు ఎక్కించి మైమరపింపచేసే మాయా దర్పణం! అక్షరాల తోటలో నిత్య పరిమళాల సుగంధం మానవునికి దైవం అందించిన వరప్రసాదిని! చదవండి...చదివించండి..చదవడం మాకిష్టం అనేలా!! పుస్తకం మన అస్తిత్వం. ~ అడుసుమల్లి రవి కుమార్ భౌతిక శాస్త్ర ఉపాధ్యాయులు.