కదన రంగం

జీవితం అనే కదనరంగానికి నీవే ఒక సైన్యం!!

ఎదను మండించిన ఆక్రోశాన్ని ఆయుధంగా మార్చి, కదులు
కుతకుతలాడే రుధిరపు ఆవేశాన్ని కరవాలంగా మార్చి, కదులు

కారే కన్నీటి చుక్కలని తుపాకీ గుండ్లలా మార్చి, కదులు
దూరే పిరికితనాన్ని నిర్జించి, ధైర్యాన్ని ధరించి, కదులు

కూలే బ్రతుకులు, కాలే కడుపులు, రగల్చిన మంటని మోస్తూ కదులు
అవినీతి సెగలూ, అసమర్ధపు చేతలూ, మిగిల్చిన బ్రతుకును మార్చడానికి కదులు

భావావేశపు సున్నితత్వం, కవుల కలాలు, నీ తలరాతను మార్చలేవని తెలిసి కదులు
నీ తరపున గొంతెత్తిన గళాలు మధ్యలోనే ఎందుకు మూగపోయాయే తెలిసి కదులు

నిన్నెవరు ఆపలేరు..
బక్క శరీరంపై నాట్యం చేసే లాఠీలు..
తెగిన నరాలపై విహారం చేసే గాయాలు..
శుష్కించిన దేహంలోకి దూసుకెళ్ళే తూటాలు..
కుటిల యుక్తులు, మారణకాండలు,
దమననీతులు, ఏమార్చే మాటలు..
ఇవేవీ నిన్ను ఆపలేవు,
ఎందుకంటే ఇప్పుడు నీవొక సైన్యం..

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

వివాహ వార్షికోత్సవం

వలయం

కొత్త సంవత్సరం