కొత్త సంవత్సరం
Good bye 2017.........Welcome 2018
కొత్త సంవత్సరాలు మనకి కొత్త గానీ,
అనాది కాలగమనానికి కాదు!
అలుపుసొలుపు లేని నిత్య చైతన్యాలాపనకి
కొత్తా పాతా ఏమిటి?
పండంటి పాపాయిలా విరిసే సూరీడూ,
నిండైన జవరాలిలా మెరిసే జాబిల్లీ
రోజూ చూస్తున్నా అందంగా లేవూ?
పరవశంగా సాగే పక్షుల కువకువలూ,
ఆనందంగా ఊగే ఆకుల రెపరెపలూ
ఎప్పటికప్పుడు కొత్తగా లేవా?
రాగం పలికే వేణువులా మనసుంటే
ప్రతి గాలి తెమ్మెరా సంగీతమవ్వదూ?
నేస్తమా రారమ్మంటూ స్వాగతిస్తే
ప్రతి అనుభూతీ చినుకులా తడపదూ?
మనల్ని మనం ఆనందంగా ఉంచుకోడానికి
కొత్త సంవత్సరాలూ, సుముహూర్తాలూ, పండుగలూ రావాలా?
జీవితాన్ని ప్రేమించడం నేర్చుకుంటే ప్రతి రోజూ పండుగ కాదా?
కాలం కదిలితేనే అందం.
అప్పుడే గా అనుభవం జ్ఞాపకం అయ్యేది.
ఆశలు, నిజంగా మారి పలకరించేది.
జీవితానికి పరమార్థం గమనమే అయితే,
ఆ దారిలో ప్రతి మజిలీ మరి గమ్యమే కదా..
దాటి పోయిన కాలాన్నిబేరీజు వేసుకోడానికి.
నూతనోత్సాహాలతో మళ్లీ మొదలవ్వడానికి.!
అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.
అడుసుమల్లి రవికుమార్
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి