రెండూ...రెండే

ఆనందం, విషాదం,
చెరో చెయ్యి పట్టుకుని,
జీవితాన్ని నడిపించేస్తున్నాయి,
అదేమిటో,
ఆనందానికి అప్పుడప్పుడు అలుపన్నా ఉంటుంది,
విషాదానికి ఎన్నడూ అలసటే ఉండదు!

జీవితపు కోర్టులో,
కాలం జడ్జి ముందు అనుదినం,
తప్పొప్పుల వాదులాట జరుగుతూనే ఉంటుంది,
వాది, ప్రతివాది ఇద్దరూ బలవంతులే,
అదేమిటో,
కాలం సునాయాసంగా తీర్పుని ఇచ్చేస్తుంది!

సంపద, సంతోషం,
ఈ క్షణం ఒకదానితో మరొకటి,
మమేకమైనట్టే ఉంటాయి,
అదేమిటో,
మరో క్షణంలోనే విభేదించుకుంటాయి!

ప్రేమ, ద్వేషం,
ఒకరినొకరు ద్వేషించుకున్నట్టే ఉంటాయి,
అదేమిటో,
అవసరార్థం అటుఇటు మారిపోతూ,
ఆలింగనం చేసుకుంటాయి!

జీవితం పెద్దదో, చిన్నదో?
గమ్యం దగ్గరో, దూరమో?
సాగే నిరంతర ప్రయాణంలో,
చివరకు మిగిలేది,
గుప్పెడు జ్ఞాపకాలు,
పిడికెడు అనుభూతులు….

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

వివాహ వార్షికోత్సవం

వలయం

కొత్త సంవత్సరం