మనిషి-మనసు

మనిషి ఎంత చిత్రమో,
మనసు అంత విచిత్రం,
ఆలోచనలు అనంతం,
ఆశలు అపరిమితం,
అంతా అర్థం అయ్యినట్టే అనిపిస్తూ,
ఏమీ అర్థంకాని విశ్వరహస్యం మానవ మనసు.
ఏ ఏ విషయాలకు ఏ మనిషి ఎప్పుడూ ఎలా స్పందిస్తాడో కనీసం మనిషిని సృష్టించిన దేవుడికైనా తెలుసా?

ఒక్కోసారి, ఓ చిన్న మాటతోనే అన్నీ చెప్పినట్లు ఉంటుంది,
మరోసారి,ఎంత మాట్లాడినా ఏమీ చెప్పనట్లే ఉంటుంది.

ఒక్కోసారి, సున్నితమైన స్పర్శలోనే ప్రేమంతా ఒలకపోసినట్టు ఉంటుంది,
మరోసారి, బిగి కౌగిలింతల్లోనూ కృత్రిమత్వమే కనిపిస్తుంది.

ఒక్కోసారి, చిరునవ్వే ఆనందాన్ని మోసుకొస్తుంది,
మరోసారి, బిగ్గరగా నవ్వినా సంతోషం ఉండదు.

ఒక్కోసారి, మొదటి కలయికలోనే ఆత్మీయులమైపోతాము,
మరోసారి, ఎన్నాళ్ళు కలిసి ఉన్నా సన్నిహితమే రాదు.

ఒక్కోసారి, కళ్ళల్లోనే ఉసులన్నీ వినిపిస్తాయి,
మరోసారి, కళ్ళల్లో కళ్ళు పెట్టి వెతికినా ఏ బాష కనిపించదు.

ఒక్కోసారి, తప్పులు కూడా ఒప్పులుగా కానవస్తాయి,
మరోసారి, మంచి కూడా చెడుగా అనిపిస్తుంది.

ఒక్కోసారి, మనిషి చేసే చిన్న పనుల్లోనే మనస్తత్వం అర్థం అవుతుంది,
మరోసారి, ఎన్ని సేవా కార్యక్రమాలలో పాల్గొన్నా ఏదో సంశయం ఉంటుంది.

ఒక్కోసారి, ఎంత అందమైన జీవితం ఇది అనిపిస్తుంది,
మరోసారి, ఈ బతుక్కి ఇన్ని కష్టాలా అనిపిస్తుంది.

ఒక్కోసారి, అందరూ అత్మీయులుగానే అగుపిస్తారు,
మరోసారి, బందువులు కూడా బద్ధ శత్రువులుగా కానవస్తారు.

ఒక్కోసారి, భారమైన మనసుకు తోడు కావాలనిపిస్తుంది,
మరోసారి, బాధలోనూ ఒంటరిగానే ఉండాలనిపిస్తుంది.

ఒక్కోసారి, ప్రసంశలు మాటల్లో వినిపిస్తాయి,
మరోసారి, విమర్శలు నుదుటి చిట్లింపుల్లో కనిపిస్తాయి.

ఒక్కోసారి,చిరునవ్వు సమాధానమవుతుంది,
మరోసారి, అవునన్నా, కాదన్నా ఏదీ జవాబు కాదు.

ఒక్కోసారి, ప్రేమ కఠినంగా బాధిస్తుంది,
మరోసారి, ద్వేషం సున్నితంగా సంతోషపెడుతుంది.

ఒక్కోసారి కాదు, మరోసారి కాదు ఎన్నిసార్లయినా మనిషి సారం మరో మనిషికి అర్థం కానే కాదు…అందుకేనేమో తెలుసుకోవాలన్న ఉత్సుకత ఎప్పటికీ తగ్గదు, తీరదు…!

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

వివాహ వార్షికోత్సవం

వలయం

కొత్త సంవత్సరం