నా క్రిస్మస్ సందేశం

జీసస్ ...
నువ్వేమో
దుఃఖిత యూదుల
పోరాట యోధుడివి...
భువిలో వీరులమంటూ తలెత్తి నిలబడ్డ
రారాజులకు ఏకైక అపవాదివి.
రాచరికపు ప్రజా పీడనల క్రౌర్యానికి ఎదురెళ్లిన, దీనుల సైనిక శక్తివి.
జనం కోసమే నిలబడిన ధీరుడవు.
2000 ఏండ్ల క్రితమే పరపీడన పరాయణత్వాన్ని ప్రశ్నించిన స్పూర్తి ప్రదాతవి

కానీ జీసస్...
అభద్రత గల అనుచరుల వల్ల
సోమరిపోతుల దుష్ట తలంపుల వల్ల
పోప్ ల స్వార్ధ చింతన వల్ల
తాంత్రికుడిలా, దేవుడిలా
మతమనే చట్రంలో బంధీవయ్యావు
దైవ కుమారుడిలా ఈ లోకానికి పరిచయం అయ్యావు.

అయ్యో..నీ "పేరు"తో నడిపే మిషనరీలు
కాసుల వేటలో కళంకమైపోయాయి.!
నీ "మత"మని చెప్పుకునే బిషప్పుల విలాస నృత్యాలే మిగిలాయిప్పుడు.!

నేడు జీసస్ అంటే సువార్త రహిత వ్యాపారం.
రెండు వేలయేళ్ల నాడు జనం కోసం,
క్రీస్తు ధరించిన ముళ్ల కిరీటం
ఇప్పుడో డినామినేషన్ల కుత్సిత పోరాటం.

అందుకే జీసస్...
మరోసారి నువ్వు తిరిగి జన్మించు..
ముళ్ల కిరీటం ధరించటానికో,
రాజ్యం చెక్కిన శిలువెక్కి
రక్తం చిందించటానికో కాదు.!

కౄరనేరాలను దునుమాడే ఉప్పెనలా,
దౌర్జన్యం,దోపిడీలపై దూసిన ఖడ్గంలా,
అజ్ఞాన బోధకుల మందబుద్ధిని మసిచేసే జ్వాలలా
అణచబడ్డవాళ్ల కొరకు పోరాడే సింహం లా
తిరిగి జన్మించు.
దీనుల రాజ్య సంకేతంలా సంచరించు.!

జనులు కోరే దేవుని రాజ్యం(రాకడ) ఇదే..ఇదే..ఇదే.!

-అడుసుమల్లి రవి కుమార్✍️

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

వివాహ వార్షికోత్సవం

వలయం

కొత్త సంవత్సరం