శివా

ఉన్నత స్థానంలో నేనుండాలని కోరుకుందామని నిన్నేతుక్కుంటూ వస్తే స్మశానంలో కనపడ్డావ్."నువ్వెంత ఉన్నత స్థానానికి వెళ్ళినా,రావాల్సిన స్థానం ఇదే"నని చెప్పకనే చెప్పావు కదయ్యా...
ఇంకా నిన్నేం అడగాలి శివ...

వేల కోరికలు కోరుకొని గుడిబయటికొస్తుంటే ప్రసాదంగా బూడిదిచ్చారు.."నేను నీకేమిచ్చినా,
నీ శరీరం ఎప్పటికైనా పొందేది ఇదే"నని
చెప్పకనే చెప్పావు కదయ్యా...
ఇక నిన్నేం అడగాలి శివ...

ఎవరికీ చెప్పుకోలేని కష్టాలు నీకు చెప్పుకుందామని వస్తే ..ఆయనే గొంతులో విషాన్ని పెట్టుకొని మింగలేక, కక్కలేక కష్టపడుతున్నాడనే మాటలు విన్నాను...ఇక నేను చెప్పుకోవాలనుకోవడం మూర్ఖత్వమే కదయ్యా...
ఇక నిన్నేం అడగాలి శివ...

గంగని తలపై పెట్టుకొని,పార్వతికి శరీరంలో సగ భాగం ఇచ్చి..స్త్రీ సృష్టికి మూలం అనే విషయం చెప్పకనే చెప్పావు కదయ్యా...
ఇక నిన్నేం అడగాలి శివ...

మెడలో పాముని వేసుకొని,అది తినే ఎలుకని కొడుక్కి వాహనంగా ఇచ్చి,పాముని తినే నెమలిని ఇంకో బిడ్డకి వాహనంగా చేర్చి,నువ్వెక్కి తిరిగే నందిని తినే సింహాన్ని పార్వతికి ఆసనంగా మార్చి,అవన్నీ ఒకే దెగ్గర ఉండేలా చేసి ..ఇవే జాతి వైరం లేకుండా పక్క, పక్కన బ్రతుతున్నాయి,మరి జ్ఞానమున్న మనుషులూ మీ పరిస్థితేంటి అని ప్రశ్నిస్తున్నావు కదయ్యా...
ఇక నిన్నేం అడగాలి శివ...

నీ గురించి ఎంత చెప్పినా తరిగేది కాదు...
ఎందుకంటే నీ గురించి చెప్పడం కూడా నీ చర్యే కదయ్యా..

"శివుడు అశ్చర్యం కలిగించే శక్తులు ఉన్నవాడు కాదు,అర్ధం చేసుకుంటే అద్భుతం అనిపించే వ్యక్తిత్వం ఉన్నవాడు"...

ఓం నమశ్శివాయ!!

నాలోన శివుడు గలడు,నీలోన శివుడు గలడు....

శుభరాత్రి

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

వివాహ వార్షికోత్సవం

వలయం

కొత్త సంవత్సరం