ఆడబిడ్డలను సదువుకోనీండి

చిన్న వయసులోనే తమ కలలను
పుట్టి నింటికీ,మెట్టెనింటికీ త్యాగం చేసిన ఆడబిడ్డలకు.....

సీరపైన సొక్క తొడుక్కొని
పత్తిచేలో పత్తి తీస్తుంటే
ఆపరేషన్ థియేటర్లోని డాటరమ్మలా ఉండావు తల్లీ!

ఏం సేత్తాం సెప్పు
ఆడపిల్లకు సదువెందుకని
తలకు మించిన భారం వొద్దనుకుని
నీ తలకో తమ్మే దగిలిస్తే
సారా తాగేమొగుడితో సంసారాన్నీదుతున్నావ్
గుదిబండలాంటి జీవితం
గుప్పెడు మెతుకులకోసమే కదా తల్లీ!

కూలీనాలీ చేసి
నీ కొంగుకు ముడేసి కట్టి
నీ బిడ్డల కోసం దాచిన యాభైరూపాయిల నోటును చుస్తే
నలిగిన నోటుమీద నవ్వే గాంధీ కూడా ఏడుస్తూనే కనబడతున్నాడు!

నీ బతుకును ఎగతాళి చేసి
పసుపు తాడే పలుపుతాడులా
కట్టుబాట్ల కట్టుగొయ్యకు నిన్ను కట్టిపడేస్తే
చిక్కుముడుల సంసారాన్ని చిరునవ్వు తో భరిస్తున్నావు కదా తల్లీ!
నీ మట్టిపాదాలకు నా అక్షరపుష్పాంజలి

~ అడుసుమల్లి రవి కుమార్

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

వివాహ వార్షికోత్సవం

వలయం

కొత్త సంవత్సరం