ఆనందోబ్రహ్మ
మట్టిలోంచి
పొడుచుకొచ్చి
పచ్చగా మెరిసిపోతోంది
గడ్డి మొక్క.
మట్టితునక
మంచు చినుకు
దాని ఠీవి ముందు
నిలబడలేక
జారిపోతున్నాయి.
తాళలేని
ఎండకు ఏమాత్రం
వెరవట్లేదు సాలె పురుగు
శ్రద్ధగా
గూడు అల్లుతోంది.
రాబోయే ఆహారాన్ని
ఊహించుకుంటూ.
బండరాళ్లను
అనువుగా పైకెత్తటానికి
ప్రణాళికల్లో
మునిగిన ఇంజనీర్ లా
కష్టపడుతోంది
చీమ.
తీపి ముక్కను
గూటికి చేర్చడానికి.
ఎక్కడన్నా
శూన్యం పొడసూపుతుందేమోనన్న
విధి కర్తృత్వం తో
అటూ ఇటూ
తిరుగుతూ
బిజీగా ఉంది గాలి.
గమనిస్తూ ఉంటే
చైతన్యం
నిత్య చైతన్యం లా
అణువణువునా
అనుభవ మౌతోంది
విశ్వం
చైతన్యం...
నిత్య నూతనం
పరిణామం
క్షణం క్షణం.
ఆనందం
అనుక్షణం
ఆనందోబ్రహ్మ.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి