పరమేశ్వరుని సన్నిధిలో
తండ్రి పరమేశ్వరా.....
ఒక అంకం
ముగిసిపోతున్నది
నీవు ఏర్పరచిన
జగన్నాటక రంగంలో
ఒక పాత్ర ముగిసిపోతున్నది
పాత్ర ఔచిత్యంలో నేను
నా పాత్రకు
న్యాయం చేసానో
నటించానో
జీవించానో
నిర్ణయించే
సమయం
ఆసన్నమైంది
ఏమి పొందానో
ఏమి కోల్పోయానో
ఏమి కోరుకున్నానో
ఏమి ఆశించానో
ఏమి వదులుకున్నానో
ఏమి వదలకున్ననో
ఏమి జ్ఞప్తికి లేవు
నా అస్థిత్వానికై పడిన తపన
పొందిన ఆరాటం
జరిపిన జీవన పోరాటంలో
నీ అస్థిత్వాన్ని గమనించక
వృధా పరచిన కాలమెంతో
నా అజ్ఞానాన్ని
మన్నించి కరుణించు
ఎంతో ఆరాటపడి
ఎన్నో సంపాదించా
విలువైన నీ సన్నిధి వదిలి
వెలలేని విషయాలను పట్టుకున్నా
అంకెను వదిలి
సున్నాలను మాత్రమే ఎర్పరచుకున్న
నా అమాయకత్వాన్ని
దయతో మన్నించు
అవసరమైన
నీ అనుగ్రహాన్ని మాత్రము మరచి
అనవసరమైన
ప్రతి విషయంలో మైమరచిపోయా
శాశ్వతమైన నీ బంధాన్ని వదిలి
అశాశ్వతమైన బంధాలకు బందీయైన
నా మూర్ఖత్వాన్ని వాత్సల్యంతో మన్నించు
పాశ్చ్యాత్తాపముతో
పరితపించే జీవులకు
నీ పద కమలముల
శాశ్వత సన్నిధి ఒసగగల
బోళా శంకరుడివని నమ్మి
అవసాన సమయములో
అర్ధిస్తున్నాను తండ్రి
నీ చరణ సన్నిధే నా పెన్నిధి గా మార్చు
ఈ జన్మకైనా మరే జన్మకైనా
నీవే నా తండ్రివై తోడు నీడగా
నడిపించి నీచెంతనే నిలిచేలా
అనుగ్రహించే
బాధ్యత
భారము నీదే
శివయ్యా
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి