వృక్షబోధ

మిత్రమా వృక్షం మాట్లాడితే..నీతో ఊసులాడితే
వింటావా.!?
అయితే నీ కోసమే...!!

ఎందుకంత నిర్లిప్తత ?
ఎందుకా భావశూన్యత ?
నేనూ నిల్చున్నా నీలాగే...
ఎన్నో ఏళ్ళుగా ఇక్కడే, ఇలాగే...

అంకురం దశనుంచే నా సమరం ఆరంభం,
నాలోని జీవాన్ని బహిర్గతం చెయ్యాలని,
ఒక్కొక్క మట్టి కణంతోనూ పోరాడాను
వాటిని చీల్చుకు రాగానే ముందుగా
నేలతల్లికే తలొంచి నమస్కరించాను.

మొక్కగా ఎదుగుతున్న దశలో,
ఎగసి వచ్చే నాలోని జీవాన్ని చంపాలని,
ఎన్ని ఎడతెగని ప్రయత్నాలో...
మండుటెండ నా ప్రాణాన్ని పీల్చింది,
సుడిగాలి నా కొమ్మల్ని తెంపింది,
జోరువాన నన్ను ముంచేసింది
అయినా నేను రాజీపడలేదు

ఒక్కో జీవకణాన్ని ఒక్కో సైనికుడిగా
ఒక్కో ఆకునీ ఒక్కో బ్రహ్మాస్త్రంగా మార్చి,
సవాళ్లకు ఎదురొడ్డాను
బలంగా, ధృడంగా చెట్టుగా ఎదిగాను.

ఇప్పుడు నాపైకి ఎన్నో పక్షులు వాలతాయి
సందడి చేస్తాయి.
ఉడుతలు, చిన్న-పెద్ద జీవాలు, ఎన్నో...
నా నీడలో ఆశ్రయం పొందుతాయి.!

రాలే ఆకులైనా, వేసే చిగురులైనా నాకొక్కటే.
విధాత ఆజ్ఞ ఉన్నంతవరకూ నిలబడతా
ఇలాగే ధృడంగా, అంబరాన్ని తాకుతూ!

అందుకే అవరోధాల్ని అధిగమించు...
ఆశ చిగురులు తొడిగి, పరిమళించు.

ఈ విశాల సృష్టిలో తలెత్తుకు నిల్చోవాలంటే,
నీ తలదించి వినోదించాలన్న ప్రతీ దానితో,
నిబ్బరంగా అనుక్షణం పోరాడాల్సిందే !
ఒక గొప్ప ఆశయం కోసం నిలబడాల్సిందే !

అందుకే నీకు బాధ కలిగినప్పుడల్లా ,
నన్ను చూసి స్పూర్తి తెచ్చుకో,
అలుపెరుగక పోరాడుతూ, ముందుకు సాగిపో !

-అడుసుమల్లి రవి కుమార్

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

వివాహ వార్షికోత్సవం

వలయం

కొత్త సంవత్సరం