తేల్చేద్దాం

నీతో నువ్వు... నాతో నేను తేల్చుకుందామా!?

కాసేపు మనల్ని మనం చూసుకుందాం
ఒక్కసారి ముసుగులన్నీ విప్పి 'నగ్నంగా' నిలబడదాం
మనతో మనమే మాట్లాడుకుందాం
మనలో మనమే తర్కించుకుందాం

మనల్ని మనమే పోల్చుకునే ప్రయత్నం చేద్దాం
నాకు కనిపించే నిన్నూ, నీకు కనిపించే నన్నూ తరిమి తరిమి కొడదాం
నీకు మాత్రమే కనిపించే నిన్నూ, నాకు మాత్రమే కనిపించే నన్నూ ఎదురెదురుగా నిలబెడదాం

నేనెవరని ప్రశ్నించుకుందాం, వచ్చే సమాధానాన్ని ధైర్యంగా విందాం
పచ్చి నిజాన్ని తాగుదాం... గరళమో, అమృతమో అరాయించుకుందాం
వెంట తిప్పుకుంటున్న నీడల్ని ఈరోజుకి కుక్కల బోనులో కట్టేద్దాం
తాయెత్తులన్నీ పీకి సముద్రంలోకి విసిరేద్దాం
నిప్పుని గుప్పెట్లో పట్టుకుని నిలుచుందాం

తేల్చుకుందాం...చచ్చేలోగా
నీతో నువ్వు, నాతో నేను!!

~ అడుసుమల్లి రవి కుమార్

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

వివాహ వార్షికోత్సవం

వలయం

కొత్త సంవత్సరం