మెదడునూ కడుగుదాం

వెనకకు రానిది కాలమే కాదు 
మాట కూడా
మాట శాంతి సందేశాలనిస్తుంది
అణ్వస్త్రాలకు అడుగులూ నేర్పుతుంది
మాట పడటమంటే దెబ్బ మీద దెబ్బ
మాటకు గొంతు తుపాకీ గొట్టం
ట్రిగ్గర్‌ మాత్రం మెదడు హస్తగతం

చేయి సైతం ఓ కీలుబొమ్మే
కరచాలనంతో హృదయ పుష్పం విప్పారినా
తలమీద చల్లని స్పర్శతో
వెన్నెల జల్లులు కురిపించినా
భుజం తట్టి బరువు దింపి
జారిన ధైర్యాన్ని గుండెల్లోకి తెచ్చినా
ఒకరి కోపానికి తాను పరికరమై
సాటి మనిషిని తోసేసినా
చొక్కా పట్టినా, చెంపను చరిచినా
చేయిది సుశిక్షిత సైనిక పాత్రే

ఇంద్రియాలన్నీ ఇంగిత జ్ఞానకోవిదులే
మంచే చేయాలనుకుంటాయి
మనిషి చేష్టలకు మదన పడతాయి.
కానీ 'యజమాని' అజ్ఞాన కబోది!
తన అసహనానికీ అవగుణానికీ
వాటి నిగ్రహాన్ని కొల్లగొడుతున్నాడు.
అందుకే మేని తో పాటు మెదడునూ "కడుగుదాం"!

~ అడుసుమల్లి రవి కుమార్

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

వివాహ వార్షికోత్సవం

వలయం

కొత్త సంవత్సరం