జీవితం

ఏమి వెతుకుతున్నావూ?
యీ బ్రతుకుల బూడిదలో నీవూ!
చావుల బ్రతుకుల సంజ వెలుగులో
మసక చీకటుల నల్లని పొగలో
అలముకొనే చిక్కని నీడలలో
చెదిరిన కలల అడుగు జాడలలో
నమ్మకాల ఆరిన రవ్వలకై
ఆశయాల వాడిన పువ్వులకై
కన్నీరుల యింకిన గురుతులకై
బూడిదలో నెత్తురు మరకలకై
నీవు వెతుకుతున్నావా?

వెతికేందుకు ఇక్కడ ఏమున్నది?
యీ అనంత జీవితశూన్యంలో
రేజీకటి నిండిన దైన్యంలో
గాలి అలల అస్పష్టపు టేడ్పులు
అవి ఒంటరి జీవాత్మల మూల్గులు
నలుదిక్కుల చొరనేరని నీడలు
బ్రతుకుచెరల కనుపించని గోడలు
ఎక్కడ వెలుగు తెరవు యీనిశిలో?
స్వేచ్ఛాసీమ ఉన్న దేదిశలో?
చీకటి! కటికి నిరాశల చీకటి!

ఈ పెనుచీకటి లేనిరోజులూ
బ్రతుకొక యుద్ధం కానిరోజులూ
ఒకానొకప్పుడు ఉన్నాయేమో?
మనమాలస్యంగా వచ్చామేమో?
ఏమో మరి, మనమొచ్చేసరికే
చూపుమేర పరుగెత్తేలోపే
జీవితశకటం తప్పిపోయినది.
మనలను మసితో కప్పిపోయినది.!

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

వివాహ వార్షికోత్సవం

వలయం

కొత్త సంవత్సరం