శివోహం
శివయ్యా
అనుక్షణం నీ వాత్సల్యానికి
ఆనందముతో పులకరించే
హృదయ ఫలకమే
నీకు ఆసనము
నీవున్నావనిస్థిరముగా నమ్మి
భక్తి తో రాసిన
భావములే నీకు
భస్మ గంధములు
నీ సన్నిధి చేరాలని అంతులేని
ఆవేదనతో వేడిన
ప్రార్ధనా సుమాములే
అలంకారములు
నీ కరుణకు పరితపిస్తూ
ఆవేదనతో ఉప్పొంగిన
కన్నీటి బిందువులే
అభిషేక జలము
నీ రూపము చూసి
అవ్యక్తమైన ఆనందముతో
మురిసి మెరిసి మైమరచి
కనుల కాంతులే నీకు హారతులు
ప్రతిక్షణం
శివయ్యా శివయ్యా శివయ్యా అంటూ
ఆర్తితో పలవరిస్తూ
మైమరచిన మనసే
నీకు నైవేద్యము
ఎందరో ఎన్నో
మార్గముల
నిను
తలచి
కొలిచి
పిలచి
సేవించి
తపించి
తరించిరి
నా మూఢ భక్తి చాలదా
పరమాత్మవైన
నీ పాదముల చెంత
నన్ను పరమాణువుగా నిలపుటకు
పరమ పవిత్రమైన నీ పాద స్పర్శలో
ప్రతి క్షణం పరవశం పొందుటకు
పరమేశ్వరా
పాహి పాహి
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి