పాఠం చెబుతున్నా

ఫలితం కన్నా వైఖరి మిన్న!

పాఠం చెబుతున్నాను...

ఇప్పుడేం … చాన్నాళ్ల నుంచీ చెబుతూనే ఉన్నాను

విద్యార్థి ఇంజనీరో డాక్టరో ఇంకేదో అవ్వాలంటాడు
కానీ మొదట అతను మనిషి కావాలి కదా!?

దారుల గురించి చెప్పొద్దూ …
ఏ దారి ఎక్కడికెళ్తుందో తెలపొద్దూ …
ఎవరు ఏ దారిని ఎందుకు వేశారో అవగతమైతేనేగదా
తను వెళ్లాల్సిన దారిని వెదికి పట్టుకోగలడు

తన కోసం పణమయ్యే ప్రాణాలుంటాయని తెలియొద్దూ …
కన్నీళ్లను చూపని త్యాగాలుంటాయని తెలియొద్దూ..

అడవి పాడే పాటలుంటాయని
నిషిద్ధగానపు నిజాలుంటాయని
మరణంతో ఆగని రుణాలుంటాయని తెలియొద్దూ …

చెప్పాల్సిందే చెబుతున్నాను
చేయాల్సిందే చేస్తున్నాను.
ఆలోచన రేపొద్దూ …

గొంతులోనే ఆగిపోయిన పాటలెందుకున్నాయో
కళ్లలోనే ఇంకిపోయిన కలలు ఎందుకున్నాయో
మధ్యరాత్రే ఆరిపోయిన మంటలెందుకున్నాయో ఆలోచన రేపొద్దూ ..

నడుస్తున్న నాటకం అర్థమైతేనే గదా
తను ధరించాల్సిన పాత్రేదో తరచి చూసుకోగలడు
పల్లవికీ చరణాలకూ మధ్య
చరణాలకూ చరణాలకూ మధ్య
నడకసాగని కాలముండొచ్చు
వేచి ఉండే ఓపికివ్వొద్దా …

ఎక్కడో ఏ మలుపువద్దో ద్రోహమెదురై గాయమవ్వొచ్చు
గుండె చెదరని ధైర్యమివ్వొద్దా …
అడుగు కలిపిన పాదమేదో మధ్యదారిన జారిపోవచ్చు
పట్టు సడలని స్ఫూర్తినివ్వొద్దా …

పిల్లలూ.. పరీక్ష ఓ ఫలితం కోసమే
ఆ ఫలితం మరో పరీక్ష కొరకే
ఇదో "అంతులేని" ప్రక్రియ
అంతుచూసే విక్రియ కాదర్రా!!
సంతోషమా....బాధా...??
అంతా మీ చేతుల్లోనే మీ వైఖరుల్లోనే!!

~ అడుసుమల్లి రవి కుమార్

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

వివాహ వార్షికోత్సవం

వలయం

కొత్త సంవత్సరం