వినాయక చవితి
ఆనందం, జ్ఞానం, ఐశ్వర్యం, బలం- ఈ నాలుగు తత్వాల ఈశ్వరత్వమే గణపతి స్వరూపం. ఆ స్వామి ఆరాధన వల్ల ఆ నాలుగూ లభిస్తాయని పురాణాలు, ఆగమాలు వివరిస్తున్నాయి. పృథ్వీవాసులందరికీ భూ తత్వమే ప్రధానం. యోగ, ఉపాసన తత్వాల పరంగా భూ రూపమైన పరమేశ్వర తత్వమే గణేశుడు. మిగిలిన నాలుగింటినీ కలబోసుకున్న అవనీ తత్వమూర్తిగా దైవాన్ని భావించడమే మట్టి గణపతి రూపంలోని ప్రత్యేకత.
నాలుగు దిక్కుల వ్యాపకత్వమే ‘చతుర్భుజం విష్ణుం’. ఏ వర్ణమూ లేని ఆకాశ తత్వమే ‘శుక్లాంబరం ధరం’. శుద్ధ జ్ఞానమే ‘శశి వర్ణం’. ఆనందానుగ్రహ భావమే ‘ప్రసన్న వదనం’.
ప్రకృతి పురుషుల ఏకతత్వమే పార్వతీ శంకరుల తనయుడిగా వ్యక్తమైంది. వేద, పురాణ, ఆగమ, కావ్య, సంగీత, నాట్య, శిల్ప, చిత్రకళ రూపాల్లో గణేశుడికి అత్యంత ప్రాధాన్యం ఉంది.
తెలివితేటలకు, నాయకత్వ లక్షణాలకు గణేశుడు అధి దైవం. ఉపాసన శాస్త్రాల్లో బాల గణపతి నుంచి మహా గణపతి వరకు అనేక రూపాల్ని వర్ణించారు. దేవ, దానవ, మానవ, పశు, పక్షి, వృక్ష- ఇత్యాది భిన్నజీవుల గణాల్ని పరిపాలించే ఏక ఈశ్వర తత్వమే ‘గణపతి’ అని రుషుల తాత్పర్యం.
గణపతి తత్వాన్ని ఆధారం చేసుకొని, అత్యంత విస్తారమైన సంప్రదాయం ఉంది. శైవ వైష్ణవ శాక్తేయాల్లాగే ‘గాణపత్యం’ ఒక విశిష్ట విశాల శాస్త్రం. ఉన్న ఒకే ఈశ్వరుణ్ని భిన్న నామ రూపాలతో ఆశ్రయించి కొలుచుకొనే సమున్నత సంస్కృతిలో- ఆ పరమేశ్వరుడి గణేశ రూప లీలావైభవాలు బహు విధాలు. లోతైన తాత్వికత, యోగ రహస్యాలు వినాయకుడి విశేషాల్లో దాగి ఉన్నాయి.
వర్షాలకు భూమి తడిసి, పూర్ణంగా అంకురించి ఎదిగే దశ- భాద్రపదం. అది సత్ఫల కారిణి కావాలన్న ఒక ఆకాంక్ష... ఈ మాసంనాటి గణేశ పూజలో అంతర్లీనమైంది. శ్రావణ మాసంలో వరలక్ష్మి, భాద్రపదంలో వరద వినాయక చతుర్థి. గాణపత్యం సంప్రదాయంలో శుక్ల చవితులకు ‘వరద చవితి’ అని పేరు. ఏడాదిలో పన్నెండు చవితి తిథులు హేరంబ పూజకు ప్రాధాన్యాలు. వాటిలో ముఖ్యం ఈ శుద్ధ చవితి. అభీష్ట సిద్ధులే వరాలు. వాటిని ప్రసాదించే స్వామి ‘వరదుడు’. వరద మూర్తయే నమః అని ‘అధర్వ శీర్షోపనిషత్తు’ చెబుతుంది. సిద్ధే వరం కాబట్టి, ఆయన సిద్ధి గణపతి.
ఒక కార్యానికి ఐశ్వర్యం, దాని ఫలమైన ‘సిద్ధి’ మాత్రమే. సిద్ధి కోసమే ఏ పనైనా! కార్యానికి ఆటంకాల్ని తొలగించే సిద్ధి- గణేశ శక్తి. ఆ సిద్ధియే అసలు లక్ష్మి (సంపద). అన్నింటి కంటే గొప్ప లక్ష్మి అయిన ‘సిద్ధి’ స్వామి శక్తి కావడంతో- ఆ శక్తిని సిద్ధ లక్ష్మీదేవిగా, ఆయనను లక్ష్మీ గణపతిగా ఉపాసిస్తారు.
భారతదేశంలో ఆసేతు శీతాచలమూ విధిగా పూజించే ఈ గణనాయకుడు- దేశ ‘జనగణ’ముల ‘మన’సులకు ‘అధి నాయకుడు’. ‘భారత భాగ్య విధాత’గా అనుగ్రహించాలని ప్రార్థిద్దాం. పంజాబ్, సింధు, గుజరాత్, మరాఠా మొదలుకొని- వింధ్య, హిమాచల, యమున, గంగాది ప్రాంతవాసులందరూ ఈ చతుర్థీ ఉత్సవాల్ని సంబరంగా జరుపుకొంటారు.
వేదాల ప్రకారం, యజ్ఞ తత్వమే గణపతి. దేవత, మంత్ర, ద్రవ్య, క్రియ- అనే నాలుగింటితో కూడినదే యజ్ఞం. ఈ నాలుగు గణాల నియామకుడైన యజ్ఞ రూపుడు ‘గణపతి’. యజ్ఞంలో ఉపయోగించే వేదాలు నాలుగు. అగ్నిగుండం చతురస్రం- చతుర్భుజ గణపతి స్వరూపం. ఆయన నాలుగు సంఖ్య ప్రధానంగా కలిగిన ‘చవితి’ పూజలవాడు.
యోగపరంగా మొదటి చక్రమైన మూలాధారంలో గల ఈశ్వరశక్తి, వేదపరంగా శబ్దాలన్నింటికీ మొదటిదైన ప్రణవ శక్తి- గణపతి. అందుకే ఆయన తొలి దైవం.
భారతీయుల సమైక్యానికి గణపతి ఉత్సవాలను ప్రధాన భూమికగా ఎంచుకున్న తిలక్ వంటి మహాత్ముల భావన సాకారమై- భిన్న ‘గణా’లవారిని ‘ఏక’ భావనా సూత్రంతో సమన్వయపరచే గణపతి తత్వం దేశ హితాన్ని సిద్ధింపజేయాలి!
వినాయక చవితి శుభాకాంక్షలు 💐💐💐
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి