విఘ్నేశ్వరునికి విన్నపం
విఘ్నరాజుకో విన్నపం!
మట్టిని ముట్టుకుంటే
మరకంటుకుంటుందని
ప్రగల్భాలు పలికే నాకు
ఇప్పుడే తెలిసింది,
మరక మట్టిలో లేదు,
మనసులో పేరుకు పోయిందని!
జీవితాని కొకటే పండగ,
కాళ్ళకింద తొక్కేస్తావేమని
గడ్డి పరక గట్టిగా అరుస్తుంటే,
అప్పుడు కనువిప్పైంది,
పత్రికూడ పవిత్రతకోసం
పరితపిస్తుందని!
అక్షరాలు పిండిచేసి
ఉండ్రాళ్ళు చేద్దామంటే
నాకప్పుడు గుర్తొచ్చింది,
కాంక్షలకు బందీనై ఆంక్షల
సంకెళ్ళలో బిగిసుకున్నానని!
చెల్లుబాటు కాదంటూ
చిన్నచూపు చూడబోకు,
లంబోదరా నీ దగ్గర
డంబాలెందుకు కాని,
దండోరా వేసుకోలేని
పరిస్ధితి నాది!
మెండైన దేవరవని
కొండత పత్రి తేలేను!
చిత్తగించు స్వామీ,
నా చిత్తాన్ని సమర్పిస్తాను!
గుండెనిండా పీఠం వేస్తాను,
దండాలెట్టి ప్రార్థిస్తాను!
తొందరగ వచ్చేయి స్వామీ,
గండాలన్నీ తొలిగించేయి!
అండగ ఉంటానని అభయమీయి,
నాకంతే చాలు!
ఇంతేనయ్యా! నా చిన్న విన్నపం!
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి