కాలపు తునకలు
సూర్యోదయం, సూర్యాస్తమయం
చంద్ర కళలు, చుక్కల వెలుగులు
మళ్ళీ మళ్ళీ జరిగే దృశ్యాదృశ్యాలు
వీచే గాలి..
మలయంగా స్పృశించనూ వచ్చు,ప్రచండమై పెకలించనూ వచ్చు!
వర్షించే మేఘం..
జల్లులతో పాటు ఝల్లులనూ కురిపించవచ్చు!
కాచే ఎండ..
నునువెచ్చదనమే కాక మేని మంటలనూ పుట్టించవచ్చు!
ప్రతీ మార్పులోనూ ఓ అతిశయం ఉంది.
త్రిపాత్రాభినయం చేసే కాలం
భూత,వర్తమాన, భవిష్యత్తు లుగా గమ్మత్తైన నాట్యంతో నర్తిస్తూనే వుంది!
మార్పు కోరుతూ మనిషి కసిగా
కాలం వెంట పరిగెడుతూనే ఉన్నాడు,
పగ్గాలేసి పట్టుకోటానికి ప్రయత్నిస్తున్నాడు,
అర్థం చేసుకోవాలని ఆరాట పడుతున్నాడు!
మార్పు కావాలంటే గుండెలు బాదుకుంటే
సరిపోదు,
గతం గొ(తి)ప్పలు మరచి
కొత్త బాటలో నడచి
ప్రస్తుతాన్ని నిర్మిస్తూ నిరంతరం
అప్రమత్తంగా ఉండక తప్పదు!
మనిషి మహర్షిగా మారాలంటే,
"కుళ్ళు" పేరుకు పోకుండా
ఎప్పటికప్పుడు కడగక తప్పదు.
కాలపు తునకలను ఒడిసి పట్టక తప్పదు!
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి