బుల్లితెర

రంగుల వల... బుల్లితెర
అది మన జీవితాలను
కంట్రోల్ చేసే రిమోటైంది.
గర్భస్థ పిండం నుండి
ఒంట పట్టించుకొన్న ఒక్కొక్క విలువనూ
వలువలుగా ఒలిచి పారేసి
మనల్ని నడివీధిలో
ఆదిమానవుడిలా నిలబెట్టింది!
అమ్మాయి హైహీల్స్, లిప్‌స్టిక్‌లు, మాయిశ్చరైజర్‌లు,
బ్యూటీటిప్‌లు లేకుండా
యిప్పుడు బతకలేదు!
అందంగా లేనని అనుక్షణం
ఆత్మనూన్యతకు లోనయ్యేవారెందరో!కుర్రాళ్ళు బాడీ బిల్డప్ కోసం
పడుతున్న అవస్థ అంతా ఇంతాకాదు
నైక్ బూట్లు, ఫాషన్ బైకు లేనిదే
కాలేజికి రానివ్వరంటాడు వాడు
గర్ల్ ఫ్రెండ్ లేనిదే జీవితం లేదని
వాడికి పాఠాలు నేర్పింది
ఈ బుల్లి తెరనే!
పబ్‌లు క్లబ్‌ల కలల్లో తేలిపోతూ
వాడు వేసుకునే జీన్‌పాంట్ల లాగే
జీవితాన్ని చింపుకుంటున్నాడేమో!
అత్తాకోడళ్లది జన్మ వైరమని
ఈ మా మన టీవీనే
ఇల్లాలి కళ్లు తెరిపించింది.
కుట్రలు కుతంత్రాల కొత్త లోకాన్ని చూపింది.
ఇంటి చాకిరీలో మగ్గుతున్న
అత్తెసరు బతుకుల ముందు
అందాల భరిణిల వ్యాయామాలు,
డైటింగులు, డేటింగ్‌లు
ఆనంద తాండవాలు
పట్టుచీరల పరదాలు
రంగుల కలల వలలను
పరుస్తుంది అది ప్రతిరోజూ
కుటుంబ విలువలన్నిటినీ
మూలాలనుంచి విధ్వంసం చేస్తూ
వ్యక్తిత్వాలను విచ్ఛిన్నం చేసే
ఈ బుల్లి బకాసురుడి జాడ్యం వదిలేదెన్నడో?
మనము మళ్లీ మనుషులమయ్యేదెప్పుడో!?

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

వివాహ వార్షికోత్సవం

వలయం

కొత్త సంవత్సరం