ప్రకృతి
ప్రకృతి...
జీవిత సత్యాల గుప్తనిధి ,
మనసుతో నిశితంగా పరిశీలిస్తే,
ఎన్నో పాఠాలు నేర్పే ఉపాధ్యాయిని
అందరినీ పోషించే అన్నపూర్ణ
పల్లవించే సత్తా నీలో ఉంటే,
కొండైనా లోయైనా బండైనా,
తలవంచుకు ఒగ్గి నీకనువుగా,
దారి ఇవ్వాల్సిందేనంటుంది,
తలెత్తుకు నిలబడ్డ చిన్నచిగురు.
ఎన్ని అనుకోని విపత్తులెదురైనా,
ఎన్ని జాడ్యాలు మొదలంటా తొల్చినా,
నువ్వు ధృడంగా స్థిరంగా నిలబడి,
ఆశల చిగురులేస్తున్న లతలకు,
ఆలంబన కమ్మంటుందో వృద్ధ వృక్షం.
దారున్నప్పుడు పయనం గొప్ప కాదని,
బండలనైనా కరిగించే సంకల్పబలంతో,
ఓపికతో ఒరిపిడిని ఓర్చుకుంటూ,
దారిచేసుకుని దాహార్తిని తీర్చమని,
గలగలలతో బోధిస్తుంది సెలయేరు.
చిక్కుముడిలా పెనవేసుకున్న వనం,
మొక్కకి మొక్క ఎన్నడూ అడ్డం కాదని,
ప్రాణి ప్రాణికెన్నడూ అడ్డంకి కాదని,
మరి మనిషికి మనిషే అడ్డమెందుకని,
మీలో తేడాలెందుకని సూటిగా ప్రశ్నిస్తుంది.
ఆటవికుల నుండి మానవులమైన మనం,
ప్రకృతి నేర్పే కనీస పాఠాలు నేర్చేందుకు,
మళ్ళీ అడవితల్లి ఒడిలోకి వెళ్ళాలేమో !
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి