ఆస్వాదించేయ్
రాలిన పూవు మట్టిలో కలిసిపోతుంది
వాలిన చూపు ఎక్కడో నాటుకుపోతుంది
కురిసిన వర్షం వంకలో వాగులో చివరకు సముద్రంలో కలిసిపోతుంది
పొద్దుటి వెలుగు మీదకు చీకటి తరుముకొస్తుంది
చీకటి పంచిన కలలను ఏ వెలుగో తుడిచేసిపోతుంది
నిన్నటి రాత్రి నేటి రాత్రి ఒక్కటి కాదు
నిన్నటి వెన్నెల ఇవాళ్టి వెన్నెల వేరు వేరే
మధ్యలో ఈ కాలం గొడవేమిటి
గుండ్రని భూమికి దిశలేమిటి?
ఎటు వెళ్ళినా నీవు ముందుకే వెళ్తావు-
నీ జీవితాన్ని నీవు ఇటు నుంచి అటూ
అటు నుంచి ఇటూ జీవిస్తావు
ఎటు వెళ్ళినా ఇక్కడికే వస్తావో లేక ఎక్కడికైనా పోతావో?
ఏమైతేనేం?
నీ కాలం
నీ ప్రాణం
నీ ప్రయాణం
ఒక్కటే అయినప్పుడు!
ఏమైపోతేనేం?
నీ గానం
నీ గాయం
నీ జ్ఞాపకం
నీ వెన్నంటే వస్తున్నప్పుడు!
జీవితంలో ప్రతి క్షణాన్ని ఆస్వాదించేయ్
ఎందుకంటే ఒక్కోసారి గెలుపే ఓటమి,ఓటమే గెలుపు మరి!
~ అడుసుమల్లి రవి కుమార్
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి