పునరపి జననం పునరపి మరణం

ఇప్పుడే వచ్చా ఈ లోకానికి,
ఇక్కడ నాకంతా కొత్తగా ఉంది!

ఊపిరాడక ఉక్కిరిబిక్కిరౌతుంటే,
ఉఛ్వాస, నిశ్వాసాలౌతానంది గాలి!

చీకటిలో కన్నుగానక కకావికలమౌతుంటే ,
కనుపాపలో కాపురముంటానంది వెలుగు!

ఆకలితో అలమటిస్తూ నకనకలాడి పోతూంటే,
కాయలూ పండ్లూ రాల్చింది చెట్టు!

దప్పికై నాలిక పిడచకడుతూంటే
దబ్బున చిరుజల్లు కురిపించింది మబ్బు!

మాటలు రాక తడబడుతుంటే,
పాటలు పాడి నేర్పించింది కోయిల!

అంతా బాగానే అనిపించింది,
అలా కాలం గడిచి పోతూనే ఉంది!
అందుకు ప్రత్యుపకారం చేయాలనిపించింది,
అడిగాను ధీమాగా ఏం కావాలని!

ముక్త కంఠంతో గాలి, వెలుగు, చెట్టు, మబ్బు, కోకిల
అన్నీ నాకు చేసింది ఒకటే అభ్యర్ధన!

తెలుసుకునే ఉంటావు దేవుడు ఎక్కడ ఉంటాడో,
మర్మం మాకు కూడ చెప్పి పుణ్యం కట్టుకోమని!

తల దించుకున్నాను నా అవివేకానికి,
గుర్తొచ్చింది వచ్చిన పని మర్చిపోయానని!

తప్పు నీదంటే నీదని
యుద్ధానికి దిగాయి బుద్ధి,చిత్తాలు

కాళ్ళూ చేతులూ వణుకుతున్నాయి,
కళ్లు బైర్లు కమ్ముతున్నాయి, 
చెవులు గింగురుమంటున్నాయి,
నాలిక బయటకొచ్చేస్తోంది,
చర్మం బిగుసుకు పోతోంది,

కాలం గావు కేక వేసింది,
కదిలి పోదాం వచ్చేయమని!

అన్వేషణ అలాగే మిగిలి పోయింది!

అప్పుడు నాకు జ్ఞానోదయమైంది!
మళ్ళీ పుట్టక తప్పదని!
పునరపి జననం పునరపి మరణం...

🌱శుభోదయం 🌷

~ అడుసుమల్లి రవికుమార్

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

వివాహ వార్షికోత్సవం

వలయం

కొత్త సంవత్సరం