సమతౌల్యం
శుభోదయం...
కాలం కన్నా ముందు పరిగెడతానంటే
నీ ప్రయత్నం అవివేకమే
కాలంతో పాటు పయనిస్తానంటే
నీ లక్ష్యం అభినందనీయమే !
నీ ప్రయాణాన్ని నియంత్రించడానికి
ఎత్తు పల్లాల చిక్కులుంటాయి
అడ్డుగోడల లెక్కలుంటాయి
విజ్ఞతతో ఛేదిస్తేనే
జీవన ప్రవాహం ప్రశాంతం
జీవిత గమనం సుఖాంతం !
అలసి సొలసి ఆగిపోతానంటే
ఆదమరచి విశ్రమిస్తానంటే
మలినాలతో కూడిన బురదైపోతావ్
వ్యర్ధాలకు నిలయమైన ఊబై పోతావ్ !
వేగం జలపాతంలా ఉరుకై ఉండాలి
వేగం నదీ ప్రవాహంలా చురుకై ఉండాలి
అడ్డొచ్చిన కొండబండల్ని
నెమ్మదిగా కోసెయ్యాలి
తోడొచ్చిన చెత్తాచెదారాల్ని
అట్టడుగున తొక్కెయ్యాలి !
వేగం సూర్యకిరణంలా చీకటిని చీల్చాలి
వేగం చంద్రకిరణంలా వెన్నెల పరచాలి !
రక్తంలో ప్రవాహవేగం
శరీరాన్ని కాపాడుతుంది
శ్వాసలో నియంత్రణ వేగం
ప్రాణాల్ని నిలబెడుతుంది !
వేగం ఆవేశమైతే బంధాలు తెగిపోతాయి
వేగాన్ని నియంత్రించుకుంటేనే
జీవితాన్ని సాధించుకోగలం
వేగాన్ని తమాయించుకుంటేనే
సమాజాన్ని శోధించుకోగలం !
సమతౌల్యమే విజ్ఞానం !
సమతౌల్యమే ప్రగతికి సోపానం!!
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి