దుఃఖం

దుఃఖానికి భయపడతావా.!?

దుఃఖం నీ కళ్ళలోని చెత్తను కడిగిపారేస్తుంది.
నువ్వు నిజంగా చూడలేకపోయిన చిత్రాలను స్వచ్ఛంగా చూపిస్తుంది.

కన్నీళ్ళు కురవందే నీ వినీల నేత్రాకాశం ఎలా నిర్మలమవుతుంది?

దుఃఖం నిన్ను లోలోపలి నుంచి కడిగిపారేస్తుంది

కడుపు నిండా ఏడ్వలేనివాడు
గుండె నిండా నవ్వలేడు-
అందుకే..
దుఃఖాన్ని అకారణంగా బంధించకు
కాకపోతే…
కారణాన్ని మాత్రం పిడికిట్లో పదిలంగా పట్టుకో-

వానలో తడిసి పొద్దుటి ఎండకు మెరిసే కొబ్బరి చెట్టులా
పచ్చని కళ్ళతో ఆకాశాన్ని నిమురుతూ తేరుకుంటున్నప్పుడు
గుప్పిట్లో దాగిన రహస్యం…
రెక్కలు తొడుక్కుని ఎగిరిపోనూవచ్చు సీతాకోకచిలుకలా
లేదూ…
శిశిర రాగాల వసంత కోకిలలా నీ లోపలి అడవిలోకి చొచ్చుకుపోనూవచ్చు-

ఏమైనా…
నువ్వొక తెల్లని పువ్వవడం కోసం
దుఃఖంలో తడిసిపోవల్సిందే.. లోపలా, బయటా.!

శుభరాత్రి

-అడుసుమల్లి రవి కుమార్

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

వివాహ వార్షికోత్సవం

వలయం

కొత్త సంవత్సరం