ప్రభుత్వ పాఠశాలల్లో రోల్ ఎందుకు తగ్గింది

ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చేర్పించే క్రమంలో నేను ఎదుర్కుంటున్న ప్రశ్నలకు నా సమాధానం

''ప్రభుత్వ ఉపాధ్యాయుల పిల్లలు వారు పనిచేసే ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్నారా?'' అంటూ డీమోరలైజ్‌ చేయడంకోసం ప్రయత్నిస్తూన్న వారు తెలుసుకోవలసిన విషయాలు::

💥వాస్తవానికి ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు,
ప్రజలు వివిధ రూపాల్లో చెల్లిస్తున్న పన్నులనుండి జీతభత్యాలు పొందుతూ కూడా వారి పిల్లలను వాటిలో చదివించకపోవడం, చేర్పించకపోవడం ప్రధానమైన చర్చనీయాంశమే.

💥ఉపాధ్యాయుడు, తన పిల్లలను, తను బోధించే పాఠశాలలో చేర్పించడం లేదంటే ఆ పాఠశాలలో ఏవో కొన్ని ప్రధాన లోపాలు ఉన్నాయని, ఆ లోపాల్ని సరిచేయడంలో ప్రభుత్వం, అధికార వ్యవస్థ వైఫల్యం చెందిందని భావించాల్సి కూడా ఉంటుంది.

💥1990లకు ముందు ఉపాధ్యాయులు గ్రామాల్లో ఉండటమేకాదు, ఆ గ్రామంలోని అందరి పిల్లలతోపాటు వారి పిల్లలు కూడా ప్రభుత్వ పాఠశాలల్లోనే చదువుకున్నారు.90ల అనంతరం విస్తరించిన గ్లోబలైజేషన్‌ వల్ల  తల్లిదండ్రుల మానసిక స్థితిలో చాలా మార్పు వచ్చి ఇంగ్లీష్‌ మాధ్యమంలో పాఠశాల,ఐ.ఐ.టి, ఇంజనీరింగ్‌, మెడిసిన్‌లకు మోజు పెరిగింది.

💥ఈ మార్పును గమనించి ప్రైవేటుపాఠశాలలు 20 సంవత్సరాల కిందనే ఇంగ్లీష్‌ మీడియం మరియు నర్సరీ, ఎల్‌.కె.జీ, యు.కె.జి  తరగతులు ప్రారంభించి ఇ-టెక్నో, ఒలంపియాడ్‌ల స్థాయికి వెళితే,వాళ్ళకు అనుమతిని ఇచ్చిన ప్రభుత్వం తను నడిపే పాఠశాలల్లో కనీసం అంగన్‌వాడీలను విలీనం చేయలేదు సరికదా కె.జి టు పి.జి నినాదం ఇచ్చి కూడా ఒక్క పాఠశాలలో కూడా ఈ రోజు వరకు ప్రీ-ప్రైమరీ తరగతులను ప్రవేశపెట్టలేదు!

💥ఇంజనీరింగ్‌ విద్యలో అతి ముఖ్యమైన ఫిజికల్‌ సైన్స్‌ మరియు ఇంగ్లీష్‌
స్కూల్‌ అసిన్టెంట్‌ పోస్టులను సృష్టించి పాఠశాలల్లో నియమించడానికి స్వాతంత్య్రానంతరం 56 సం||రాలు (2002లో మొదటిసారి నియమించారు) పట్టిదంటే, ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా పాఠశాల విద్య పట్ల వ్యవహరించిందో అర్థం చేసుకోవచ్చు.

💥ఆంగ్ల మాధ్యమంతో పాటుగా ఇంజనీరింగ్‌, ఐ.ఐ.టి, మెడిసిన్‌లకు ఈ రెండు సబ్జెక్టులు చాలా ప్రధానమైనవి కాగా ఈ బోధనాంశాల్ని బోధించే ఉపాధ్యాయుడు తన పాఠశాలలో లేడు అనుకున్నప్పుడు,ఆ లోపం అర్థమై అదే పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు,ఏ విధంగా తన పిల్లల్ని ఆ పాఠశాలలో చదివించగలడు? వీటికి తోడు కనీస సౌకర్యాలైన నీరు, టాయిలెట్స్‌, కరెంట్‌ లేని పాఠశాలలు 65 శాతం ఉన్నాయి.

💥ఒక పాఠశాలలో ఒక ఉపాధ్యాయుడు రిటైర్‌ అయితే, అతని స్థానంలో మరొక ఉపాధ్యాయుడి నియామకాలను ప్రభుత్వం ఎప్పుడు చేపడుతుందో, నోటిఫికేషన్‌ ఎప్పుడు ఇస్తుందో, పరీక్ష ఎప్పుడు నిర్వహిస్తుందో, ఫలితాలు ఎప్పుడు ప్రకటిస్తుందో, ఎప్పుడు పోస్టింగ్‌ ఆర్డర్స్‌ ఇస్తుందో ఎవ్వరికి తెలియదు. ఒక భర్తీ నోటిఫికేషన్‌కు, పరీక్షకు, రిక్రూట్‌మెంట్‌కు మధ్య సంవత్సరాలకు పైబడి పట్టిన సందర్భం ఉంది.

💥పాఠశాల విద్యా వ్యవస్థలో ఉన్న యంత్రాంగం ఈ సమస్యలను అర్థం చేసుకోలేక పోవడం,సకాలంలో స్పందించకపోవడం,పరిష్కార మార్గాలను అన్వేషించకపోవడం వల్ల
90వ దశకం అనంతరం వచ్చిన ఇంగ్లీష్‌, ఇంజనీరింగ్‌, మెడిసిన్‌లపై మోజుతో ప్రభుత్వ ఉపాధ్యాయులు, ప్రభుత్వ పాఠశాలల్లో వారి వారి పిల్లలను చదివించకపోవడం జరిగింది.

💥మారుతున్న తల్లిదండ్రుల మానసిక స్థితికి అనుకూలంగా పాఠశాల విద్యలో మార్పులు చేయకపోవడంవల్ల,ఇంత సంక్షోభ, సంకట స్థితిని ఇవ్వాళ ప్రభుత్వ పాఠశాలలు ఎదుర్కొంటున్నాయి.

💥ఉపాధ్యాయుడొక్కడే తన పిల్లల్ని తను పనిచేస్తున్న పాఠశాలలో చదివించడం ద్వారా పాఠాలు సక్రమంగా బోధిస్తే బోధించవచ్చు కాని ఇంగ్లీష్‌ మీడియం పెట్టలేడు, కె.జి ని ప్రారంభించలేడు, తరగతి గదికో ఉపాధ్యాయున్ని ఇవ్వలేడు, కనీస సౌకర్యాల్ని తీర్చలేడు, కొత్త పోస్టు సృష్టించలేడు, కనీసం ఒక విద్యావాలేంటీర్‌నైనా నియమించలేడు! ఏ ప్రజా ప్రతినిధికి, ప్రభుత్వ ఉద్యోగికి లేని నిభందన ప్రభుత్వ ఉపాధ్యాయులకే ఎందుకుండాలి? ఉపాధ్యాయులనే బలిపీఠం పై ఎక్కించి ప్రశ్నించడం సబబేనా?

💥విద్య వ్యాపారీకరణం చెందిన తరువాత ఆ వ్యాపారం మొత్తం చేస్తున్నది కేవలం రాజకీయ నాయకులే కాదా?!

💥కార్పొరేటు విద్యాసంస్థల యజమానులు రాజకీయాల్లోకి వచ్చి విద్యావేత్తలుగా పేర్కొనబడి ఏకంగా మంత్రులయ్యారంటే ఆ వ్యవస్థలో ఏం జరుగుతుందో, ప్రభుత్వ విద్యావ్యవస్థలో రావలసిన మార్పులను ఏలా అడ్డుకున్నారో అర్థం చేసుకోలేరా?

💥విద్యావ్యాపారులు విద్యావేత్తలు కావడం ఏమిటి? మొన్నటివరకు సూడో విద్యావేత్త నారాయణ హవా చూడండి ఇట్లా ప్రైవేటు విద్యా వ్యాపారంలో పీకల దాక మునిగిన ఈ రాజకీయులు రైతుల ఆత్మహత్యలకు, పరిశ్రమల, ఆర్‌.టి.సిలో అనేక డిపోల మూసివేతకు, బ్యాంకుల కుంభకోణాలకు, ఫైనాన్స్‌ కుంభకోణాలకు కారణమైనట్లే ఇవ్వాళ ప్రభుత్వ పాఠశాలలపై ప్రజలు విశ్వాసం కోల్పోవడానికి కారణమై, ప్రైవేటీకరణను వేగవంతం చేస్తూ ఉండగా ప్రజలేమో అవగాహనా లేమితో ఆ నెపాన్ని ఉపాధ్యాయులపైకి నెట్టివేస్తున్నారు.

💥ఇప్పటికైనా పాఠశాల విద్యారంగంలో నెలకొన్న పరిస్థితులపై అధ్యయనం చేసి మారుతున్న పరిస్థితులకు మరియు తల్లిదండ్రుల ఆలోచనలకు అనుగుణంగా ప్రభుత్వం మార్పులు తీసుకురావాలి. వార్డు మెంబర్‌ నుండి ప్రధానమంత్రి వరకు పోటీ చేయడానికి కుటుంబ నియంత్రణ ఏ విధంగా నిబంధనగా విధించారో, అదే విధంగా తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లో చదివించాలనే నిబంధనను విధించాలి. ప్రభుత్వ పాఠశాలల్లో చదివించే వారికే ప్రభుత్వ పథకాలను వర్తింపచేయాలి. ప్రభుత్వం ఉద్యోగాలు ఇచ్చేటప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో తమ పిల్లల్ని చదివిస్తాం అన్న రాతపూర్వక నిబంధన అంగీకరిస్తేనే ఉద్యోగమివ్వాలి. విచ్చలవిడిగా ప్రైవేట్‌ పాఠశాలలకు ఇస్తున్న అనుమతిని రద్దు చేసి ప్రజల అవసరాలకు సరిపడా పాఠశాలల్ని ప్రభుత్వమే నెలకొల్పాలి. ప్రభుత్వ పాఠశాలల్లో తరగతి గదికో ఉపాధ్యాయున్ని విద్యా సంవత్సరమంతా ఉండే విధంగా చర్యలు గైకొనాలి.

💥విద్య యొక్క లక్ష్యం పౌరులను తయారు చేయడం.ఈ దేశానికి కావలసిన పౌరులను తయారుచేసే బాధ్యత రాజ్యానిది.విద్యను వ్యాపార కోణంలో చూడకూడదు.

💥మంచి సమాజం నిర్మాణం అనేది ప్రభుత్వ పాఠశాల తరగతి గది నుండి ప్రారంభమవుతుంది.ఎందుకంటే మనిషి, శ్రమ, సంపద విలువలను అర్థం చేసుకునేలా తరగతి గదులుండేది ప్రభుత్వ పాఠశాలల్లోనే. ప్రభుత్వ పాఠశాల తరగతి గదుల్లో చదువుకునే పిల్లల మధ్య ధనిక, బీద, కుల, మత బేధాలు సమసి ఒకరంటే ఒకరికి గౌరవభావం ఏర్పడుతుంది.

💥ప్రభుత్వ పాఠశాలల్లోని సమస్యలను పరిష్కరించి తమ పిల్లల్ని ప్రజా ప్రతినిధులు, అధికారులు, న్యాయమూర్తులు విధిగా ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలి. అప్పుడు ఉపాధ్యాయుల పిల్లలు కూడా ఖచ్చితంగా ప్రభుత్వ పాఠశాలల్లోనే చదువుతారు.

💥ఈ రాజకీయ వ్యాపారులు అందుకు ముందుకు వస్తారా? ప్రభుత్వాన్ని రానిస్తారా? ఈ పరిస్థితి పోవాలంటే ప్రజానీకం ఉద్యమించాలేమో!!

ప్రభుత్వ పాఠశాలను ఆదరించడం మన సామాజిక బాధ్యత.

~ అడుసుమల్లి రవి కుమార్

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

వివాహ వార్షికోత్సవం

వలయం

కొత్త సంవత్సరం