జ్ఞాపకాలు
నిన్ను గుర్తుకు తెచ్చుకోవడంలోనే నాకూ నేను గుర్తొస్తాను,
ఎవర్ని గుర్తుకు తెచ్చుకుంటున్నానో అర్థం కాదప్పుడు.
కొన్నిసార్లు జీవితంలో జ్ఞాపకానివి
ఇంకొన్ని సార్లు జ్ఞాపకంలో జీవితానివి
ముత్యాలు జారినట్లు నీ నవ్వులు
వెన్నెల్లు కురిసినట్లు నీ చూపులు
ఆత్మీయత నిండిన ఆలింగనాలు
చిరునవ్వుల గుభాళింపులు.
ఇప్పుడేమయ్యాయి ? అవన్నీ ఎక్కడున్నాయి ?
కళ్ళు మారాయా? కాళ్ళు మారాయా ?
కాలం ముళ్ళకు చిక్కిన మనసులు చిరిగాయా ?
అవునులే..
చెప్పుకున్న మాటలకు అర్ధాలు చెరిగాయి
అల్లుకున్న బంధాలకు పేర్లు మారాయి
చేసుకున్న బాసలకు ఆధారాలు విరిగాయి
కలిసిన మనసుల మధ్య దూరాలు పెరిగాయి
కాలాలు మారాయి.. కధలూ మారాయి..
ఆ జ్ఞాపకాలే ... గెలిచామని చెప్పేందుకు మిగిలాయి..
నీ జ్ఞాపకాలే ... తడి కళ్ళు తుడిచేందుకు మిగిలాయి.
జ్ఞాపకాల ఉప్పెన ముంచెత్తుతుంటే,
తీరానికి తీసుకునిపోయే కాగితపు పడవే నువ్వు!!
~ అడుసుమల్లి రవి కుమార్
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి