సర్కారు బడి

మన సర్కారు బడి ఎంతో అందమైంది
అచ్చం అమ్మ మోములా
ఊరి చివర ఉన్నాకూడా
అమ్మ ఊసుల తత్వమే
పచ్చని ప్రకృతి మధ్య
స్వచ్ఛంగా ఉంటుంది
అచ్చం అమ్మ ప్రేమలా!

అమ్మ ఒడిలా
మన బడెప్పుడూ
నిండుకుండలా ఉంటుంది
తన స్తన్యాల్ని మార్చిమార్చి
అందించే తల్లిలా
కడుపు నిండా విలువల్ని
విద్యని అందిస్తుంది
కథలతో ఏమార్చి
ఆకలి తీర్చే అమ్మలా
పాఠాలతో పరిణతి పెంచుతుంది

ముద్దముద్దకీ అమ్మ
మన పొట్ట తడిమినట్లు
ఏటికేడాది మన జ్ఞానాన్ని
దివిటీలా పట్టిచూస్తుంది
ఏమైతేనేం అంతా
మన సర్కారు బడి చలవే
ఇవాళ తలో దిక్కున మనమంతా
స్థిరంగా ఉన్నాం

కానీ అందరికీ తెలిసి
మన బడే అనాథలా మిగిలింది!
కాన్వెంట్లనే కల్తీ తల్లులొచ్చాక
డబ్బా పీకకి, తల్లి రొమ్ముకి
తేడా అనేదే
తెలుసుకోలేకుండా పోతున్నాము

కానీ.. అమ్మెప్పుడూ అమ్మే
మన బడే మన అమ్మ
మన అమ్మే మన బడి!
సర్కారు బడిలో విద్యంటే
నిరంతం కదలాడే
తీపి జ్ఞాపకాలే...!

ప్రభుత్వ పాఠశాలను ఆదరించడం
మనందరి సామాజిక బాధ్యత!!

~ అడుసుమల్లి రవి కుమార్

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

వివాహ వార్షికోత్సవం

వలయం

కొత్త సంవత్సరం