కూతురు

నా బిడ్డను చూస్తుంటే...

నా గుండెల మీద రెండు కలువపూల పాదాలు
కదలాడుతున్నట్టుగానే వుంటుంది
రెండు వెన్నపూస పెదాలు నవ్వుతున్నట్టే ఉంటుంది.
రెండు తమలపాకు చేతులు
నా మెడని సుతారంగా చుట్టుకుని
ఉయ్యాల ఊగుతున్నట్టే అనిపిస్తుంది.

ఏ షాపుకైనా వెళతానా
అక్కడ బొమ్మలన్నీ నా చిట్టితల్లిలా
నాన్నా నాన్నా అని పిలుస్తున్నట్టే అనిపిస్తుంది.
అలా దారిలో కాన్వెంటు పిల్లల్ని చూస్తానా
అనేక రూపాల్లో మా అమ్మాయే ఆడుకుంటున్నట్టు ఉంటుంది.

నా నయనాలకెప్పుడూ తనో బుజ్జి యువరాణి. దివి నుండి భువికి దిగిన దేవకన్య!

తనకి చలేస్తే నేను పత్తికాయనై పగిలిపోతాను
తను జ్వరంతో మండిపోతే
వంద రెక్కల విసనకర్రనై తన చుట్టూ ప్రదక్షిణలు చేస్తాను
తను జబ్బు పడితే మొత్తం వైద్యశాస్త్రాన్నే తప్పుపడతాను.

ఒక్కసారి నవ్విందా
ఒళ్ళంతా వేల పియానోలు చుట్టుకొని
సజల సంగీతమై ద్రవించిపోతాను.

ఇంక తన పుట్టినరోజు వచ్చిందంటే
ఆకాశానికి నేనే బెలూనై వేలాడతాను.
కొమ్మకొమ్మకీ చాక్లెట్లూ, కేకులూ వేలాడదీసి
పక్షులకు ఫలహారంగా పెడతాను.

అదేమిటో గాని ఎప్పుడు తను నన్ను హత్తుకున్నా ఒక సుతిమెత్తని ప్రాణగీతమేదో
నా పొట్టను పెనవేసుకున్నట్టే ఉంటుంది.

కూతురంటే..
నాన్న గుండె షోకేసుల్లో నిత్యం నవ్వే మురిపాల బొమ్మ.
ప్రతి తండ్రి జీవితానికి తానొక మంచుపూలజల్లు.

~ అడుసుమల్లి రవి కుమార్

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

వివాహ వార్షికోత్సవం

వలయం

కొత్త సంవత్సరం