ఆస్తికత్వం - నాస్తికత్వం
ఆధ్యాత్మికత.....నాస్తికత
చిరకాలంగా మనిషిలో జరుగుతున్న
"అంతరాన్వేషణ" అవసరం మనిషికి నిజంగా ఉందా?
ఆ అన్వేషణ ప్రతి జీవితం విధిగా జరపాల్సిందేనా?
నాస్తికులు, హేతువాదులనబడే వారు నిరంతరం సంధించే ప్రశ్నలివే!!
🌼నిజానికి ఆ అన్వేషణ వైపుగా మనసు దానికదే అవసరంగా,సహజంగా ముఖం తిప్పుతుంది.జీవితసోపానంలో మితిమీరిన భారం వలన,మనస్సు యొక్క అతి సున్నితత్వం వలన,కాంతిని ఆశ్రయించి తిరిగే పొద్దుతిరుగుడు పువ్వులా హృదయం దాని భారానికి అదే ముక్తి (విడుదల - స్వేచ్ఛ) ని కోరుకుని పరిష్కారం వెంట పడుతుంది.
అలా "సహజ ప్రయోజనం" గా తోచని వారెవరూ ఈ మార్గానికి,అవగాహనకి, సాధనకి రానవసరం లేదు.
గొప్ప మందులు అన్నారని అందరినీ మింగమనలేనట్టే ఎంత గొప్ప మార్గమైనా దాని అవసరం లేని వారిని తొక్కమని చెప్పనవసరం లేదు.అలాగని ఆధ్యాత్మిక భావాలను మూఢనమ్మకాలంటూ కించపరచడం కూడి వ్యర్ధపు చేష్టలే!
🌼ఇందులో శాస్త్రీయ హేతుబద్ధ ప్రశ్నలకు తావులేదు.మనస్సు ఇప్పటికీ ఏ శాస్త్రం పూర్తిగా విప్పలేని అందమైన చిక్కుముడే. మనస్సు తనని తాను భారంగా భావించినపుడు,దానిని అదే విడుచుకోవాలని,తగ్గించుకోవాలని చూడడం బహుశా మానవ బుద్ధి యొక్క ప్రాధమిక లక్షణం.
🌼మనస్సు చేత నడపబడుతున్న తమ జీవితంతో ఏప్రశ్నా లేని వారు,ఏ సమస్యా రాని వారు దీన్నో విచిత్రంగా చూడవచ్చు . లేదా పడుతూ లేస్తూ బ్రతకడాన్ని ఆనందించే వారు , అలా ఉండడాన్ని అంగీకరించే వారు , నొప్పిస్తున్న తమ బాధ వల్ల దుఃఖం తప్ప ఏ ఫిర్యాదు లేని వారు దీనిని అతిగానో , అజ్ఞానంగానో , అపరిచితంగానో విడిచిపెట్టవచ్చు.
కానీ పరిపరివిధాల పరుగులు తీసే మనసు చేత పీడింపబడే జీవితం మనసుకి ఎదురు తిరుగుతుంది లేదా అవగాహనతో చికిత్స చేస్తుంది.
🌼కనుక నొప్పించక తానొవ్వక అన్నట్లు, ఎవరికి నచ్చినట్టు వారిని బ్రతక నివ్వండి.హేతువాదులేమీ మహా జ్ఞానులూ కాదు.ఆధ్యాత్మిక వాదులేమీ తెలివిలేని వారూ కాదు.
🌼నా మటుకు నాకు నా పూర్వీకుల నుంచి సంక్రమించిన సనాతన వైదిక ధర్మాన్ని అనుసరించడమే నా మనస్సు కు ఆనందదాయకం.అలాగే నీ ప్రస్తుత బుద్ధి ప్రకారం నాస్తికత్వం నీకు అనుసరనీయం కావచ్చు...నీ దారి నీది.నా దారి నాది.చివరకు అందరమూ చేరుకునే "గమ్యం" ఒక్కటే కదా!
~ అడుసుమల్లి రవి కుమార్
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి