ప్రేమ
నాజ్ఞాపకం
నీ మదిలో మెదిలినపుడు
నీ పెదాలపై నవ్వు మెరవాలి .
నేననే ఊహ
నిన్ను కదిపినపుడు
నీ జీవితం తేలికవ్వాలి .
నా మాటొకటి
నీ చెవుల్లో మెదిలినపుడు
నీ భుజంపై నా చెయ్యి
స్పర్శలోకి రావాలి .
నునివెచ్చని ఉదయసమీరం
నీ తనవుని తాకినపుడు
నా రూపం నీహృదయంలో ప్రతిబింబించాలి .
' మనం ' అనే మిధునం
గతంలోంచి నిన్ను తొంగి చూసినపుడు
వర్తమానంలో నీ శూన్యం భర్తీ కావాలి .
జీవితసార్ధకత
నీ అస్థిత్వాన్ని ప్రశ్నించినపుడు
నువ్వు మన ప్రేమని ఋజువుగా చూపగలగాలి .
ప్రియులు తమ మాటల్లో
నన్ను తలచినపుడు
నీ గుండె గర్వంతో ఉప్పొంగాలి .
సుదూర తీరాల ఆహ్వానాన్ని
నేను స్వీకరించే లోపు .,
నాదన్నది ప్రేమగా నీకు అర్పించాలి.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి