నాన్న

పాదాలు ముందుకు కాదు వెనక్కు కదులుతున్నాయి
బాల్యం ఒక జ్ఞాపకం....!
కళ్లను దారి వెంట పరచిన క్షణాలు ఇంకా అలానే ఉన్నాయి
ఎక్కడో ఒక శబ్దం....
అన్నీ అయిపోయినట్టే ఉంటుంది
అప్పుడే మొదలైనట్టూ ఉంటుంది

పదే పదే కలవరించినా ఎవ్వరూ రారు
అదేపనిగా కళ్లు తడిచిపోతున్నా తుడిచే చేతులు లేవు
అప్పుడు నాన్న ఒక కథానాయకుడు
నడిచే నాటకం... కదిలే పద్యం
నాడు నా వేలు పట్టుకుని నడిపించిన నాన్న
నేడు వేరే వేషం వేసుకున్నాడు
వెలుగుతున్న దీపం రెపరెపలు
ఆకాశంలో మెరుపుల విరుపులు

నాన్న ఒక ఉద్వేగం... నాన్న ఒక బాధ్యత
కాలం చాలా క్రూరమైంది
ఏ క్షణాన్నీ కుదురుగా ఉండనివ్వదు
అనుభవాలనన్నింటినీ జ్ఞాపకాలను చేసి
జీవితాన్ని ఒంటరితనంలోకి నెట్టేస్తుంది
ఇంతకు ముందు నాన్నను ఇంట్లోనో, ఊళ్లోనో వెతుక్కునే వాన్ని
ఇప్పుడు శ్మశానంలో వెతుకుతున్నా
అక్కడక్కడా పడ్డ ఎముకల్లో వెతుక్కుంటున్నా
చితిలో కాలిపోయింది నాన్న దేహం కాదు
అక్కడ మిగిలిపోయింది నాన్న ఎముకలు కావు
అవి అనుభవాలు..
అవి జ్ఞాపకాలు.....
ఇప్పుడు నాన్నలేడు...
నాన్నే ఒక జ్ఞాపకమై ప్రతి క్షణం అక్షరాలవుతున్నాడు
అంతా అయిపోయినట్టే ఉంటుంది
మళ్లీ అప్పుడే మొదలైనట్టూ ఉంటుంది.....!!!

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

వివాహ వార్షికోత్సవం

వలయం

కొత్త సంవత్సరం