బ్రతుకాట

బ్రతుకాట..బ్రతుకట...బ్రతుకుట!!


కనుచూపు మేర ఎడారే కనబడినా
ఆశల చెలమలకై వెతికే పయనం...
బ్రతుకాట

ప్రతీ మలుపులోనూ ఇన్నాళ్ళూ ఇది నాకు తెలియదే అనుకుంటూ చేసే ప్రయాణమిది.
బ్రతుకాట

కోల్పోయినవేంటో గెలుచుకున్నవేమిటో
అసలు పద్దు తేల్చేది నువ్వూ నేనూ కాదు.
కాలం.
బ్రతుకాట

మోస్తున్న బరువెంతో నాకే తెలియదు...దింపుకున్న క్షణం వరకు.
బ్రతుకాట

మంచి అనిపించుకోడానికి ఎన్నో ఓర్చుకోవడం
చివరికొచ్చేసరికి మంచి అనిపించుకున్నా, లేకపోయినా ఒరిగేదేమీ ఉండదని తెలుసుకోవడం.
బ్రతుకాట

మనిషిని మనిషి ప్రేమించాలి అన్న సూక్తి పాతబడింది.
మనిషిని మనిషి భరించడమే ఇక.
బ్రతుకాట

వాక్యానికి చివర ఉండే చుక్కలాగ రోజు చిట్టచివర  మిగిలుంటుంది ఆశ..
చుక్క లేని వాక్యం అసంపూర్ణమట కదా..
బ్రతుకాట

గమనం రేపటికి చేరుస్తున్నా
జ్ఞాపకం నిన్నలలోకి విసిరేస్తుంది
ఎన్నో  సంఘర్షణలకు తావిచ్చి
నన్ను ఒంటిగా మిగులుస్తుంది.
బ్రతుకాట

~ అడుసుమల్లి రవి కుమార్

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

వివాహ వార్షికోత్సవం

వలయం

కొత్త సంవత్సరం