రంజాన్ శుభాకాంక్షలు
నా బ్రతుకు మలుపులో
తారసపడిన ప్రతి ముస్లిం మిత్రుడూ
నాకో రంజాన్ చంద్రుడే!
ఐదు గంటలకే అజాన్ అరుపు
అమ్మ చేతి కంటే ముందు
నా అంతరంగపు దుపట్టాను పట్టి లాగేది.
అల్లా కూడా కూసింది లేరా అంటూ
నాన్న మాటల్లోనూ అదే ఆర్ద్రతాగీతం.
సిర్ప టోపీలు పెట్టుకున్న నా చిన్ననాటి ముస్లిం సోదరులంతా ఎర్ర దుబ్బ ఇసుకల్లో నమాజుకేసి సాగుతుంటే చుక్కలు పొడిచిన ఎన్ని ఆకాశాలో నేల మీద కదిలిపోతునట్టే ఉండేది.అత్తరు పరిమళాలు,
అలాయిబలాయీల్లో ఆత్మీయతలు దేశంలోని జాతీయ సమైక్యతకు
ప్రాణం పోస్తున్నట్లుండేవి.
మసీదు గడియారం 'అల్లా'రంతోనే
మా ఊరి దినచర్య మొదలయ్యేది.
నా చలి ఉదయాల్ని టీ చుక్కలతో
వెచ్చబరిచే హనీఫ్ భాయీ..
నొక్కుకుపోయిన నా సైకిలు బుగ్గలకు
ప్రాణాలూదే రఫీమియా..
వచ్చీరాని ఉర్దూపదాలతో
ఉబుసుపోని నా మాటల కబుర్లకు
భాషా మధురిమల్ని పంచిపెడుతూ
భాష్యం చెప్పే షకీల్ భాయీ..
వయసుకు చిన్నవాణ్ణయినా 'మామా' అంటూ ఆత్మీయ కంఠాన్ని ఒలకబోసే యూసుఫ్ అల్లుడూ..
కారు డ్రైవింగ్ లో నాకు ధైర్యాన్ని పంచిన పిడుగురాళ్ల జాని భాయీ..
ఏ ఒక్కరిలోనూ నాకు ముస్లిం కనిపించలేదు.ఏ ఒక్కరికీ నాలో హిందువు కనిపించలేదు.మానవత్వం నింపుకున్న ఇద్దరు మనుషులు తప్ప!
మా చుట్టూ బిర్యానీ రుచుల పరిమళాలూ
సేమ్యా పాయసాల తీపి ఘుమఘుమలూ తప్ప మతవాసనల జాడలే కనిపించేవి కావు.మానవత్వాన్ని చెరిపే ఏ సరిహద్దులూ మొలిచేవి కావు.ఎర్రని పింగాణీ పాత్రల్లోంచి
ఖీర్ తో పాటు ఆప్యాయతను తోడి పెడుతున్న ముస్లిం తల్లి రజియా బేగం
ఇఫ్తార్ విందులో మా అమ్మను గుర్తుకు తెచ్చేది.సూరిబాబుకా పొట్టే, బహుత్ పడ్నేవాలా అచ్ఛా లడ్కా హై అంటూ
ఖాసీం కుటుంబం మెచ్చుకోలు చూపు విసిరినప్పుడు నాన్న ముఖంలో వెలిగిన
వేయి మతాబుల చిరునవ్వుల కాంతి
నాకింకా గుర్తే!
నా బాల్యపు పేజీల నిండా
కుడి నుండి ఎడమకీ, ఎడమ నుండీ కుడికీ
ఎన్ని తీపి జ్ఞాపకాల అక్షరాలో!
ఎన్ని ముషాయిరాలో, ఎన్ని గజళ్ళో!
నా బాల్యాన్ని ఒక ఖురాన్‌ను చేసి తిరగేస్తే
ఆ ఖురాన్‌ను మోసిన రెహాల్‌లు ఎంతమందో!
నా బ్రతుకు మలుపులో తారసపడిన
ప్రతి ముస్లిం మిత్రుడూ
నాకో రంజాన్ చంద్రుడే!
ముస్లిం సోదర సోదరీమణులందరికీ రంజాన్ పండుగ శుభాకాంక్షలతో..
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి