ప్రతి ప్రశ్నకూ సమాధానం

వడదెబ్బకి,దడపుట్టి పగుళ్లొచ్చిన నేల,
తొలకరి చినుకుల సాంగత్యంతో,
ఆకుపచ్చ కోక,ఆరుబయట ఆరేసింది.

అడుగంటా నీరింకి, శల్యమై,
డొక్కనిండా,పక్కటెముకలు తేలి,
దిక్కులు చూసే ఏరు,
ఆకాశపు ఆశీస్సుల అక్షింతలతో,
సర్రునలేచి జలతాండవం చేస్తోంది.

పండుటాకులు,ఎండుటాకులై,
దుడుకుగాలి దూకుడుతో రాలిపోతే,
నగ్నంగా నిలబడ్డ తరుశాఖ,
వసంతం,ప్రశాంతంగా పలకరించగానే
పచ్చదనంతో ప్రకాశిస్తోంది.

బెణికిన కాలు.. కాస్త వణికించినా
తర్వాత కాస్త విసిగించినా,
కాలమనే ఔషధాన్ని సేవిస్తూ,
క్రమ,క్రమంగా పునఃస్థితికి చేరుకుంది.

నేలపగులుకి వానచినుకు,
ఏరు ఎండితే జోరు వాన,
ఆకురాలితే నవ్య వసంతం,
కాలు బెణికితే, కాల ఔషధం.
ఎక్కడికక్కడే,ఎప్పటికప్పుడే,
ప్రతీ ప్రశ్నకూ, సమాధానం.!

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

వివాహ వార్షికోత్సవం

వలయం

కొత్త సంవత్సరం