ప్రపంచ పర్యావరణ దినోత్సవం
పుడమి, పుట్టింట్లో అలిగి కూర్చొంది.
పచ్చకోక కరువైందని,
గొంతు తడుపుకోను గుక్కెడు నీళ్ళు కొరవయ్యాయని,
తిందామంటే ప్లాస్టిక్ భూతం గొంతునొక్కేస్తోందని,
ఊపిరాడనియ్యని
కలుషిత వాయు మేఘాలను తలుచుకుని
భయంతో ధరిత్రి, తల్లి ఒడి చేరింది.
భూమిపై నున్న మనిషేమో
మలయ మారుతాలు
హిమవీచికల వింజామరలు దొరకక
అగ్నిరేకుల పంకాలను తిప్పుతూ
ఆదిత్యుని అగ్నిపుష్పార్చనకు
ఉష్ణవాయువులు ఊదుతున్నాడు.
పళ్ళురాని , పళ్ళూడిన బోసిబుగ్గలు
బూడిదలవుతున్నాయి.
పశుపక్ష్యాదులు అలమటించిపోతున్నాయి
ఇలాగే కొనసాగితే...
అమ్మో జీవరాసుల ఉనికికి లోటురాదా
బూగోళం బ్రద్దలవ్వదా
ధరణిమాత అలుక తీర్చాలంటే
పచ్చని పందిర్లువేసి
వనాలను వృద్దిచేయాలి
కలుషిత పదార్దాలనొదలి
ప్లాస్టిక్ భూతాన్ని తరిమి కొట్టాలి
మనం వనం అవ్వాలి..వనం జనమవ్వాలి..!
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి