రాత్రి
రాత్రంటే…జీవిత ప్రతిరూపం
రాత్రి.....
ఓసారి
మత్తెక్కించే వెచ్చని అగరొత్తుల ధూపం
మరోసారి
కాలుతున్న దేహం నుంచి చిమ్ముతున్న ధూమం
ఓసారి
కనురెప్పలకు వేలాడుతూ జోకొట్టే కలల సంగీతం
మరోసారి
అమాంతం మింగేసి మెలిపెట్టి నలిపేసే కొండచిలువ
ఓ రోజు
తెలియని లోతుల్లోకి లాక్కెళ్ళే సుడిగుండాల సముద్రం
మరో రోజు
తీరానికి కొట్టుకొచ్చిన చివికిపోయిన కాగితప్పడవ
ఓసారి
పగలు చేసిన గాయాలపై ముద్దులు అద్దే ప్రేయసి
మరోసారి
ప్రేమగాయం స్రవించే బాధల జలదరింపు
ఓసారి
వెన్నెల పూలు,వెలుగు చుక్కలతో అలరించే ఉద్యానవనం
మరోసారి
కాలే శరీరాలు,మూల్గే నక్కలతో భయపెట్టే స్మశానం
ఓసారి
వెదురు పొదల్లో సేద దీరుతున్న పగటి గీతం
మరోసారి
మట్టి పుట్టలో బుసలు కొట్టే మిన్నాగుల స్వగతం
రాత్రనేది
చావునీ ఇస్తుంది
బతుకునూ తెస్తుంది
అన్నిసార్లూ ఒకే రంగును చూపని అందమైన రంగుల రాట్నమే రాత్రి.!
అందుకే రాత్రనేది జీవితానికో ప్రతిబింబం.!
శుభరాత్రి
-అడుసుమల్లి రవికుమార్
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి