చెట్టునే చూడాలి

కొన్ని ఆకులు ఎండిపోతున్నా
ఆ చెట్టు వేల పచ్చని ఆశలతో
నవ్వుతూనే ఉంది

రాలి పడిపోతున్న తన పువ్వుని
ఏ మాత్రం తొణక్కుండా
జ్ఞానయోగిలా పరికిస్తోంది

గుబురుకొమ్మల పానుపు పరిచి
ఎగిరెగిరి అలసిన పక్షులని
రారమ్మని స్వాగతిస్తోంది

ఎన్ని శిశిరాలను జయించినా
ఎన్ని వసంతాలను వరించినా
విజేతనన్న గర్వం లేక
వినమ్రంగా నిలబడింది

అందనంత ఎత్తుకి ఎదిగినా
విత్తు నాటి ఉనికినీ
మట్టివేళ్ళ అనుబంధాన్నీ
నెమరేసుకుంటూనే ఉంది

ఆకు ఆకున పాట తానై
పండు పండున నిండు మనసై
కొమ్మకొమ్మన మంచితనమై వెల్లివిరిసింది

సిసలైన మనిషిలా జీవించాలంటే
అసలైన జీవితాన్ని చూడాలంటే

తదేకంగా ఆ చెట్టుని చూడాలి
ఆ చెట్టునే చూడాలి!!

-అడుసుమల్లి రవి కుమార్

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

వివాహ వార్షికోత్సవం

వలయం

కొత్త సంవత్సరం