ప్రకృతి

పుట్టే ప్రతీ ప్రాణినీ...
హృదయభాషతో స్వాగతిస్తూ,
అభేధ భావంతో ఆదరిస్తూ,
తన అందాలతో మురిపిస్తూ,
నిర్మలంగా ప్రేమిస్తూ,
నిశ్శబ్దంగా ఓదారుస్తూ,
ఆత్మీయంగా ఆదరిస్తుంది ప్రకృతి.

ప్రతి రోజూ...
ప్రశాంత శుభోదయాన,
చుర్రున మండే మధ్యాహ్నాన,
మలయ సమీరపు సాయంత్రాన,
వెన్నెల చలువల రాతిరిలోన,
కోటి రంగులు అద్దుకుని,
వినూత్నంగా విస్మయపరిచే భావం ప్రకృతి.

చూసే కళ్ళకు మనసుంటే...
కటిక చీకటిలో- కోటి తారల్ని
నల్ల కోయిలతో- మధుర రాగాల్ని,
కొండ లోయల్లో- సెలయేటి పరవళ్ళని,
అనుభూతి కుంచెతో గుండెపై చిత్రించి,
స్నిగ్ధంగా నవ్వే.....ముగ్ధమనోహరి ప్రకృతి.

యుగయుగాలుగా...
ఎన్నో చరితల పుటల్ని,
ఎన్నో రహస్య గాధల్ని,
ఎన్నో మధుర జ్ఞాపకాల్ని,
ఎన్నో  వైపరీత్యాల్ని,
తనలోనే ఇముడ్చుకున్న..నిగూఢం ప్రకృతి.

మౌనంగా ఉంటూనే,
ఎగసే అల అలవక తప్పదని,
విరిసే పువ్వు వడలక తప్పదని,
కురిసే చినుకు ఇగరక తప్పదని,
పుట్టిన జీవి గిట్టక తప్పదని,
చెప్పకనే చెప్పే...నిర్వేదమే ప్రకృతి.

ఉన్నట్టుండి హఠాత్తుగా,
తనపై జరిగే విధ్వంసాన్ని ఓర్వలేనట్టు,
వరదలతో ముంచెత్తి,
భూకంపాలతో మూలాలు పెకిలించి,
సునామీలతో ఉక్కిరిబిక్కిరి చేసి,
భీబత్సంగా ప్రతిఘటించే విలయమే ప్రకృతి.

ప్రకృతి ఇచ్చే మౌన సందేశం...
ఎన్ని మెరుగులున్నా...వొదిగి ఉండాలని,
నిండు కుండలా- తొణక కూడదని,
మౌనంగానే- మమత పంచాలని,
ప్రేమకు లొంగని- ప్రాణి లేదని,
తను మన అధీనంలో కాదు---
మనం తన అధీనంలో ఉన్నామని.!

శుభరాత్రి

-అడుసుమల్లి రవి కుమార్.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

వివాహ వార్షికోత్సవం

వలయం

కొత్త సంవత్సరం